కోమ‌టిరెడ్డి కొత్త టార్గెట్ చూశారా..!

కొంత‌కాలంగా న‌ల్గొండ జిల్లాలో బ‌ల‌మైన నేత‌లుగా పేరున్న కోమటి రెడ్డి బ్ర‌ద‌ర్స్ కూడా టీఆర్ఎస్ ప్ర‌భుత్వంలో చేర‌డం ఖాయ‌మ‌ని వార్త‌లు వ‌స్తున్నాఅవి వాస్త‌వం కాద‌ని తేలిపోయింది. అంతేకాదు ఇటీవ‌ల కేసీఆర్‌ ప్రభుత్వంపై కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి సంధిస్తున్న వాగ్బాణాల వాడి, వేడి కూడా పెరిగింది. టీఆర్ ఎస్ పాల‌న‌ను, కేసీఆర్ కుటుంబ పాల‌న‌ను ఆయ‌న ఈ మధ్య అవ‌కాశ‌మొస్తే చాలు.. ఏకిపారేస్తున్నారు. అసలు  కోమటిరెడ్డిలో ఇంత ఆక‌స్మిక మార్పుకు మార్పు ఎందుకువచ్చింద‌నే చ‌ర్చ.. ఇప్పుడు కాంగ్రెస్ శ్రేణుల్లో గట్టిగానే జ‌రుగుతోంది.

కొంత‌కాలంగా స్వ‌ప‌క్షంలోని, అందులోనూ.. పీసీసీ చీఫ్ గా ఉన్న‌ ఉత్తమ్ కుమార్ రెడ్డి, మాజీ చీఫ్ పొన్నాల లక్ష్మయ్యపై కోమ‌టిరెడ్డి విమ‌ర్శ‌ల దాడికి దిగ‌డంతో… ఆయ‌న కారెక్కేందుకు వేసుకుంటున్న స్కెచ్‌లో భాగ‌మే  ఇదంతాన‌ని భావించారంతా..!  కానీ గత కొద్ది రోజులుగా కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి రూట్ మార్చారు. త‌న టార్గెట్ స్వపక్ష నేతలు కాదని, టీఆర్ఎస్ తోనే త‌న పోరాటం అన్నట్లు వ్యవహరిస్తున్నారు.  ప్ర‌త్య‌క్షంగా ముఖ్యమంత్రినే టార్గెట్ చేస్తూ… కేసీఆర్ పిచ్చి తుగ్ల‌క్‌లా వ్య‌వ‌హ‌రిస్తున్నార‌ని,ఆయ‌న పాలనలో రాష్ట్రం అదోగతి పాలవుతోందని మాట‌ల తూటాలు విసురుతున్నారు.

కోమటిరెడ్డిలో వచ్చిన ఆకస్మిక మార్పును చూసి కాంగ్రేస్ నేతలంతా షాక్ అవుతున్నారు. అంతలో ఇంత మార్పు ఏమిటీ..? అని చర్చించుకుంటున్నారు..?    కోమ‌టిరెడ్డి తాజాగా తీసుకున్న ట‌ర్న్‌..   పీసీసీ అధ్యక్ష పదవి కోసమా..? లేక నేరుగా సీఎంను ఢీకొడితే వచ్చే మైలేజీ కోసమా..? అన్న‌ది కాంగ్రెస్ వ‌ర్గాల‌కు ఓ ప‌జిల్‌గా మారిపోయింద‌నే చెప్పాలి.

నిజానికి కోమటిరెడ్డి ఎంతో కాలంగా టీ పీసీసీ అధ్య‌క్ష పదవిని ఆశిస్తున్నారు.  త‌ద్వారా తెలంగాణ‌లో భ‌విష్య‌త్తులో కాంగ్రెస్ అధికారంలోకి వ‌స్తే ముఖ్య‌మంత్రి ప‌ద‌వికి దారులు వేసుకోవ‌చ్చ‌ని ఆశించారు. కానీ ఆయ‌న ఆశించినట్టు జ‌ర‌గ‌లేదు. ఆ ప‌ద‌వి  మొదట బీసీ నేత‌ పొన్నాలకు, ఆ తరువాత ఉత్తమ్ కుమార్ రెడ్డికి ద‌క్క‌డంతో కోమ‌టిరెడ్డి పార్టీకి కాస్తం దూరం జ‌రిగారు.  అయితే కొద్ది రోజులుగా పీసీసీ చీఫ్ ను మార్చనున్నట్లు వార్తలు వస్తుండడంతో.. ఆ రేసులో ఉన్న కోమటిరెడ్డి.. సొంత పార్టీ నాయకులపై విమర్శలు తగ్గించారు. అంతేకాకుండా అధికార పార్టీ ని ఢీ కొట్టే సత్తా తనకే ఉందని హై కమాండ్ కు సంకేతాలు చేరేలా కేసీఆర్ పై కోమటిరెడ్డి విరుచుకుపడుతున్నార‌ని తెలంగాణ‌లో రాజ‌కీయవ‌ర్గాలు విశ్లేషిస్తున్నాయి.