ప‌వ‌న్ ల‌డ్డూలు-రోజా క్యాబేజీలు

పాచి పోయిన ల‌డ్డూలు, కుళ్లిపోయిన క్యాబేజీలు.. ఏంటా ఇవి! అని మొహం చిట్లించుకుంటున్నారా? కేంద్ర ప్ర‌భుత్వం ఏపీకి ప్ర‌క‌టించిన ప్ర‌త్యేక ప్యాకేజీకి మ‌నోళ్లు పెట్టిన పేర్లివి!! సినీ ఫీల్డ్ నుంచి పొలిటిక‌ల్ ఎంట్రీ ఇచ్చిన ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్‌.. ప్ర‌త్యేక ప్యాకేజీని పాచిపోయిన ల‌డ్డూలుగా పేర్కొన్న విష‌యం తెలిసిందే. ఇలాంటి డైలాగులు సినీ ఫీల్డ్‌లో రొటీన్‌గానే వినిపిస్తుంటాయి. ట్రెండ్‌ని ఫాలో అయిపోయే మూవీ ఆర్టీస్ట్స్ సైట‌రిస్ట్‌గా మాట్లాడ‌డం తెలిసిందే. ఈ క్ర‌మంలోనే ప‌వ‌న్‌.. ప్యాకేజీని పాచిపోయిన ల‌డ్డూలుగా పేర్కొన్నారు.

పాచిపోయిన వాటిని ఎవ‌రైనా తీసుకుంటారా? అని చంద్ర‌బాబుని ఉద్దేశించి ఆయ‌న స‌టైర్ విసిరారో.. లేక పాచిపోయిన ల‌డ్డూలను ఎవ‌రు ఎవ‌రికైనా ఇస్తారా? అని కేంద్రాన్ని ఉద్దేశించి ఈ కాంటెస్ట్‌లో అన్నారో తెలుసుకోలేక నేత‌లు మొద‌ట్లో క‌న్ఫ్యూజ్ అయిపోయినా.. త‌ర్వాత క్లారిటీకి వ‌చ్చేసిన బీజేపీ నేత‌లు ప‌వ‌న్‌పై ఎదురు దాడికి దిగారు. అసలు పాచిపోయిన ల‌డ్డూ ఎవ‌రైనా ఉంటే ఆయ‌న‌ ప‌వ‌నేన‌ని వ్యాఖ్యానించారు. ఇక‌, ఇప్పుడు వైకాపా ఫైర్ బ్రాండ్ ఎమ్మెల్యే.. సినీ న‌టి రోజా.. కూడా పెద్ద సైటైరిస్ట్ అయిపోయారు. ప్ర‌త్యేక ప్యాకేజీని ఆమె కుళ్లిపోయిన క్యాబేజీతో పోల్చారు. కుళ్లిపోయిన క్యాబేజీని ఎవ‌రైనా తీసుకుంటారా? ఎవ‌రైనా వండుకుంటారా? అని త‌న‌దైన స్టైల్లో కామెంట్లు కుమ్మేశారు.

ఏపీకి కేంద్రం ఇచ్చిన ప్యాకేజీపై చిత్తూరు జిల్లా కాణిపాకం లో ఆమె మీడియాతో మాట్లాడిన ఆమె.. ప్యాకేజీపై కామెంట్లు చేశారు. చిత్తూరు, నెల్లూరుకు చెందిన ఇద్ద‌రు నాయుళ్లు.. హోదాకు అడ్డుత‌గులుతున్నార‌ని విమ‌ర్శించారు. వెంకయ్య నాయుడులకు మంచి బుద్ధి ప్రసాదించాలని కాణిపాకం వినాయకుడిని కోరుకున్నట్లు ఆమె స‌టైర్ రువ్వారు. ప్యాకేజీ విష‌యం హోదా సంగ‌తి ప‌క్క‌న పెడితే.. అటు ప‌వ‌న్‌, ఇటు రోజాల పాచి పోయిన ల‌డ్లు, కుళ్లిపోయిన క్యాబేజీల స‌టైర్లు సోష‌ల్ మీడియాలో మంచి రేంజ్‌లో వైర‌ల్ అవుతుండ‌డం గ‌మ‌నార్హం.