టీడీపీ – జనసేన మరో అడుగు… ముందుకు పడుతుందా…!?

తెలుగుదేశం, జనసేన మరో అడుగు ముందుకేశాయి. ఈ నెల 9వ తేదీన సమన్వయ కమిటీ భేటీ నిర్వహించి ఉమ్మడి కార్యాచరణ దిశగా అడుగులు వేయాలని నిర్ణయించాయి. రాష్ట్రంలో ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలపై ఉమ్మడి పోరాటం, ఉమ్మడి మ్యానిఫెస్టో ప్రకటన, క్షేత్రస్థాయిలో సమన్వయంపై ప్రధానంగా దృష్టిసారించాలని నిర్ణయించారు. 9న జరగబోయే సమన్వయ కమిటీ భేటీలో వీటిపై కీలక నిర్ణయాలు తీసుకోనున్నారు.

మధ్యంతర బెయిల్‌పై విడుదలై హైదరాబాద్‌లో విశ్రాంతిలో ఉన్న టీడీపీ అధినేత చంద్రబాబును, జనసేన అధినేత పవన్‌ కళ్యాణ్‌, ఆ పార్టీ పొలిటికల్ ఎఫైర్స్ కమిటీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ శనివారం కలిశారు. దాదాపు రెండున్నర గంటల పాటు భేటీ అయ్యారు. చంద్రబాబు ఆరోగ్య పరిస్థితిపై చర్చించారు. చంద్రబాబును అక్రమ కేసుల్లో జైలులో ఉంచి వీక్ చేయాలని చూశారని, కానీ మీరు స్ట్రాంగ్ తయారయ్యారని పవన్‌ కళ్యాణ్‌ చంద్రబాబుతో అన్నారు. రాష్ట్రంలో నెలకొన్న రాజకీయ పరిస్థితులు, చంద్రబాబుపై పెడుతున్న అక్రమ కేసులు, ఇరుపక్షాల కార్యకర్తలపై పెడుతున్న కేసులకు సంబంధించి వీరి మధ్య చర్చ జరిగింది. రాజమండ్రిలో జరిగిన రెండు పక్షాల సమన్వయ కమిటీ సమావేశంలో తీసుకున్న నిర్ణయాలపై కూడా చర్చించారు. జిల్లాల వారీగా ఇరుపక్షాల నేతలు సమావేశమై పలు అంశాలపై చర్చించారని, వీటిని మరింత ముందుకు తీసుకెళ్లాలని భావించారు. ఇందుకోసం, ఈ నెల 9వ తేదీన రెండు పార్టీల సమన్వయ కమిటీ భేటీ కావాలని నిర్ణయించారు.

9వ తేదీన జరిగే భేటీలో పవన్‌ కళ్యాణ్‌, చంద్రబాబు లేకుండా కేవలం కమిటీ సభ్యులు మాత్రమే పాల్గొంటారు. రాష్ట్రంలో కరువు సమస్యను ప్రభుత్వం నిర్లక్ష్యం చేయడం, స్కీమ్‌ల పేరిట స్కామ్‌లు, చంద్రబాబుపై వరుస కేసులు వంటి అంశాలపై సమన్వయ కమిటీ భేటీలో చర్చించనున్నారు. ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలపై రెండు పక్షాలు కలిసి ఉమ్మడి పోరాటం నిర్వహించాలని భావిస్తున్నారు. ఏఏ అంశాలపై పోరాటం చేయాలి, భవిష్యత్తు కార్యాచరణ ఎలా ఉండాలి అనే అంశంపై సమన్వయ కమిటీ భేటీలో స్పష్టతకు రావాలని నిర్ణయించారు. ఇప్పటికే తెలుగుదేశం పార్టీ రాజమండ్రి మహానాడులో మినీ మ్యానిఫెస్టోని ప్రకటించగా, ఇందుకు అదనంగా జనసేన మరో ఆరు అంశాలను ప్రతిపాదించింది. సంపన్న ఏపీ పేరిట వివిధ రంగాలకు ఆర్ధిక ప్రోత్సాహం, ఉద్యోగాల కల్పన దిశగా అభివృద్ది చేసే ప్రణాళిక, అమరావతిని రాజధానిగా కొనసాగించాలని జనసేన ప్రతిపాదించింది. విశాఖ, విజయవాడ, తిరుపతిని మహానగరాలుగా అభివృద్ది చేయాలని, బిపిఎల్‌ కుటుంబాల ఇళ్ల నిర్మాణానికి ఉచితంగా ఇసుక, 30 లక్షల భవన నిర్మాణ కార్మికులకు చేయుత, ఏటా లక్ష మంది యువపారిశ్రామిక వేత్తలకు ప్రోత్సాహం, చిరువ్యాపారులు, చిన్న పరిశ్రమలకు పది లక్షల సాయం, ఉద్యోగాల కల్పనకు ప్రణాళికలు వంటి అంశాలను మ్యానిఫెస్టోలో చేర్చాలని కూడా సూచించారు. సీపీఎస్ రద్దు చేసి ఓపీఎస్ అమలుకు జనసేన ప్రతిపాదించింది. తెలుగుదేశం రాజమండ్రి మహానాడులో ప్రకటించిన మినీ మ్యానిఫెస్టోకు తోడుగా, ఈ అంశాలన్నింటినీ అందులో చేర్చాలని కూడా జనసేన కోరుతోంది. ఉమ్మడి పోరాటం, ఉమ్మడి మ్యానిఫెస్టో, క్షేత్రస్థాయి నుంచి సమన్వయం వంటి మూడు అంశాలపై ఈ నెల 9వ తేదీన జరిగే సమన్వయ కమిటీ భేటీలో రెండుపక్షాలు కీలక నిర్ణయం తీసుకోనున్నాయి.