స్పీడ్ పెంచిన టీడీపీ-జనసేన…!

ప్రజా వ్యతిరేక నిర్ణయాలపై పోరాటం చేసేందుకు టీడీపీ, జనసేన పార్టీలు మరింత స్పీడ్ పెంచుతున్నాయి. ఆదివారం నుంచి మూడు రోజుల పాటు రాష్ట్ర వ్యాప్తంగా టీడీపీ, జనసేన ఆధ్వర్యంలో సమన్వయ సమావేశాలు నిర్వహిస్తున్నారు. మూడు రోజుల్లో రాష్ట్ర వ్యాప్తంగా ఈ సమావేశాలు పూర్తి అయిన అనంతరం ఇరుపార్టీల సమన్వయంతో వెయ్యి మందితో విస్తృతస్థాయి సమావేశాన్ని నిర్వహించి భవిష్యత్తు కార్యాచరణను ప్రకటించనున్నారు.

ఏపీ వ్యాప్తంగా ఉమ్మడి జిల్లాల వారీగా టీడీపీ, జనసేన కలిసి సమన్వయ సమావేశాలు నిర్వహించేందుకు రంగం సిద్దమైంది. టీడీపీ అధినేత చంద్రబాబు అక్రమ అరెస్ట్ నేపథ్యంలో రాజమహేంద్రవరం వేదికగా నారా లోకేష్, నందమూరి బాలకృష్ణ, పవన్‌ కళ్యాణ్‌, నాదెండ్ల మనోహర్ కలిసి టీడీపీ, జనసేన రెండు పార్టీలు పొత్తు పెట్టుకోబోతున్నాయని ప్రకటించాయి. అందులో భాగంగా ఈ నెల 23వ తేదీన లోకేష్, పవన్‌ కళ్యాణ్‌ ఆధ్వర్యంలో రాజమహేంద్రవరంలో రాష్ట్ర స్థాయిలో సమన్వయ కమిటీ భేటీ జరిగింది. ఆ భేటీలో ఉమ్మడిగా కలిసి జగన్ ప్రభుత్వంపై పోరాటం చేయాలని నిర్ణయించుకున్నారు. అందులో భాగంగా క్షేత్రస్థాయిలో ఇరుపార్టీలకు చెందిన క్యాడర్‌ను ఒక చోటకు చేర్చి మరింత బలోపేతం చేసేందుకు… రాష్ట్ర వ్యాప్తంగా మూడు రోజుల పాటు సమన్వయ సమావేశాలు నిర్వహించాలని నిర్ణయించారు.

ఈ సమావేశాలను పర్యవేక్షించేందుకు జనసేన, టీడీపీ నుంచి సీనియర్ నేతలను నియమించారు. తెలుగుదేశం పార్టీ నుంచి వంగలపూడి అనిత, బుద్దా వెంకన్న, కొల్లు రవీంద్ర, దేవినేని ఉమా, ఎన్‌ఎండీ ఫారూఖ్‌, నక్కా ఆనంద్ బాబు, బండారు సత్యనారాయణమూర్తి, సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, బీదా రవి చంద్రయాదవ్, నిమ్మల రామానాయుడు, ఎం.ఏ.షరీఫ్‌, ఎన్‌.అమర్నాథ్ రెడ్డి, కాల్వ శ్రీనివాస్‌లను నియమించగా.., జనసేన పార్టీ నుంచి బొమ్మిడి నయాకర్, కోనా తాతారావు, పి.శివశంకర్, బోనబోయిన శ్రీనివాస్ యాదవ్, చిల్లపల్లి శ్రీనివాసరావు, పాలవలస యశస్వినీ, చేగొండి సూర్యప్రకాష్‌, నయూబ్ కుమార్, బులిశెట్టి సత్యనారాయణ, పడాల అరుణ, ముత్తా శశిధర్, పితాని బాలకృష్ణ, పెదపూడి విజయకుమార్‌ను జనసేన పార్టీ నుంచి నియమించారు.

ఈ నెల 29వ తేదీన శ్రీకాకుళం, విజయనగరం, తూర్పుగోదావరి, ప్రకాశం, అనంతపురం జిల్లాల్లో.., 30వ తేదీన పశ్చిమ కృష్ణ, చిత్తూరు, కడప జిల్లాల్లో.., 31న విశాఖపట్నం, గుంటూరు, నెల్లూరు, కర్నూలు జిల్లాల్లో సమావేశాలు నిర్వహించాలని నిర్ణయించారు. ఇరుపార్టీలకు చెందిన సీనియర్ నేతలు ఇప్పటికే దీనిపై పలు దఫాలుగా చర్చించి నిర్ణయం తీసుకున్నారు. ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో ఉమ్మడిగా చేసే కార్యక్రమాలు మరింత వేగవంతం చేయాలని నిర్ణయించుకున్నారు. ఈ సమావేశంలో గ్రామస్థాయిలో ప్రజా సమస్యలు, ఉద్యోగ ఉపాధిలో రాష్ట్ర యువతకు జగన్ రెడ్డి చేసిన ద్రోహం, కరువు పరిస్థితులు, సంక్షేమం పేరుతో జగన్ చేస్తున్న ద్రోహాలను, ధరల బాదుడుతో ప్రజలపై పడుతున్న భారాలతో పాటు, మద్యపాన నిషేధం పేరుతో అధికారంలోకి వచ్చి కల్తీ మద్యం అమ్మకాలతో కోట్ల రూపాయలు దండుకోవడమే కాకుండా, వేలాదిమంది మహిళల మాంగళ్యాలు తెంచుతున్న వైనం గురించి ఇంటింటికీ తిరిగి వివరించేలా ఓ కార్యాచరణ చేపట్టబోతున్నారు. ఇరు పార్టీల నేతల అభిప్రాయాలు, సూచనలతో పాటు, భవిష్యత్తు కార్యక్రమాల గురించి కూడా ఉమ్మడిగా చర్చించాలని నిర్ణయించుకున్నారు. అందులో భాగంగానే, రాష్ట్ర వ్యాప్తంగా మూడు రోజుల పాటు, ఉమ్మడి జిల్లాల వారీగా సమావేశాలు నిర్వహించాలని నిర్ణయించామన్నారు.