కేసీఆర్ వర్సెస్ ఈటలగా మారిన వైనం

గజ్వేల్ లో ఆసక్తికర పోటీకి తెర లేచింది.. ఈటల ఎంట్రీతో వార్ వన్ సైడ్ కాదని తేలిపోయింది.. కేసీఆర్ కు షాక్ ఇచ్చే రీతిలో ఈటల గజ్వేల్‌లో ఎంట్రీ ఇచ్చారు. బీఅర్ఎస్ అభివృద్ధి, సంక్షేమ మంత్రంతో వ్యూహాత్మకంగా ముందుకు వెళ్తుంటే….ఈటల మాత్రం అధికార పార్టీ లోపాలు.. సెంటిమెంట్ అస్త్రం, బీసీ మంత్రంతో కాకపుట్టిస్తున్నారు. దీంతో గజ్వేల్ లో ఆసక్తికరమైన పోటీ మొదలైంది.

తెలంగాణ రాష్ట్ర ప్రజల చూపు అంతా… ఇప్పుడు గజ్వేల్ వైపే ఉంది. అధికార బీఅర్ఎస్ కు గజ్వేల్ లో వార్ వన్ సైడే అనుకున్న తరుణంలో ఈటల రాకతో… కేసీఅర్ వర్సెస్ ఈటలగా మారింది. ఇక ఈ సారి గజ్వేల్ లో కేసీఆర్, ఈటల మధ్య గట్టి పోటీ ఖాయమని తేలిపోయింది. గజ్వేల్ లో అధికార బీఅర్ఎస్ అభివృద్ధి అస్త్రాన్ని, సంక్షేమ మంత్రాన్ని జపిస్తూ ముందుకు వెళుతోంది. ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను వివరిస్తూనే, గజ్వేల్ అభివృద్ధిని గుర్తు చేస్తోంది. అభివృద్ధి సంగతి పక్కన పెడితే… సంక్షేమ పథకాల అమలులో వైఫల్యాలు అధికార పార్టీని తీవ్ర ఇబ్బందులు పెడుతున్నాయి. డబుల్ బెడ్‌రూమ్‌ ఇళ్లు, దళితబంధు, బిసి బంధు, గృహలక్ష్మి వంటి పథకాలు ఇప్పుడు ఆ పార్టీకి గుదిబండగా మారాయి. ఆయా పథకాల అమలులో ఆశ్రిత పక్షపాతం, నిజమైన అర్హులను అందకపోవడం…కింది స్థాయి నాయకులు తమ అనుయాయులకే ఇప్పించుకోడం వంటి అంశాలు పేదలు, బిసి వర్గాల్లో తీవ్ర అసంతృప్తికి, ఆవేదనకు, నిరాశకు కారణమయ్యాయి. స్వయంగా ముఖ్యమంత్రి ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గమైన గజ్వేల్ పట్టణంలో గత తొమ్మిదేళ్ళ కాలంలో డబుల్ బెడ్ రూం ఇండ్లను పేదలకు అందజేయకపోవడం ప్రజల్లో తీవ్ర అసంతృప్తి గురిచేసింది. దీనికి తోడు మల్లన్నసాగర్, కొండపోచమ్మ సాగర్ భూ నిర్వాసితుల పట్ల ప్రభుత్వం, అధికారులు వ్యవహరించిన తీరు అయా వారిలో తీవ్ర ఆగ్రహావేశాలకు కారణంగా మారింది. దీంతో ప్రభుత్వం చెబుతున్న అభివృద్ధి, సంక్షేమ మంత్రం పనిచేస్తుందా అన్న అనుమానాలు స్వయంగా ఆ పార్టీ నేతల్లోనే నెలకొంది.

మరోవైపు ఉద్యమ కాలం నుంచి పార్టీకి సేవలందించి, పార్టీని నిలబెట్టిన తనను పక్కనపెట్టి, ఇతర పార్టీల నుంచి వచ్చిన వారికే ప్రాధాన్యం ఇస్తున్నారన్న ఆక్రోశం గజ్వేల్‌ బీఆర్ఎస్‌ నేతల్లో ఉంది. గతంలో పార్టీ తరపున జడ్పీటీసీలు గా, ఎంపిటిసి లుగా, మున్సిపల్ చైర్మన్ గా, సర్పంచులుగా చేసిన వారిని ఇప్పుడు పట్టించుకోవడం లేదన్న విమర్శలు వినిపిస్తున్నాయి. ఇతర పార్టీల నుంచి వచ్చిన వారికే పార్టీ కార్యక్రమాలు అప్పగిస్తున్నారు తప్ప తమను పట్టించుకోవడం లేదన్న అసంతృప్తి చాలా మంది సీనియర్ నాయకుల్లో ఉంది. దీనికి తోడు పెద్దనేతలు అపాయింట్ మెంట్ కూడా ఇవ్వడం లేదని, తమ బాధ చెప్పుకునే అవకాశం కూడా లేకుండాపో్యిందని బాహాటంగానే చెప్పుతున్నారు. పార్టీ ముఖ్య నేతల నుంచి స్పందన కరువవడంతో వారంతా ఈటల సమక్షంలో బిజెపి లో చేరిపోయారు.

ఇక దాదాపు ఆరు నెలల క్రితమే ఈటల రాజేందర్ గజ్వేల్ నుంచి పోటీ చేస్తా అని చెప్పడం, కేసీఆర్ అహంకారానికి, ఆత్మగౌరవానికి మధ్య జరిగే యుద్ధంలో కేసీఆర్ తోనే తేల్చుకుంటానని ఈటల ఛాలెంజ్ చేశారు. ఆ విధంగానే బీజేపీ పార్టీ నుండి గజ్వేల్ ఎమ్మెల్యే అభ్యర్థిగా బరిలో నిలిచారు ఆయన. ఎదురు దాడి వ్యూహంతో కాకుండా 20 ఏళ్లు సేవ చేయించుకుని తనను అవమానకరంగా వెళ్లగొట్టడం, హుజూరాబాద్ లో తనను రాచి రంపాన పెట్టారనడం వంటి సెంటిమెంట్ అస్త్రాలను ప్రయోగిస్తున్నారు ఈటల. గజ్వేల్ మొదటి సభలోనే అధికార పార్టీని తిట్టడం కాకుండా భావోద్వేగ ప్రసంగంతో ఓటర్లను ఆకర్షించేందుకు ప్రయత్నించారు. ఈటల రాజేందర్ కు గజ్వేల్ నియోజకవర్గంపై తెలంగాణ ఉద్యమ సమయం నుండే మంచి పట్టు ఉంది. ఈటల రాజేందర్ ముదిరాజ్ సామాజిక వర్గానికి చెందటంతో… ఆ వర్గం నుంచి మద్దతు లభిస్తోంది. అయితే బీఆర్ఎస్ పార్టీ ముదిరాజులకు ఒక్క టికెట్ కూడా కేటాయించకపోవడంతో ముదిరాజులు అధికార పార్టీపై తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు. దీనికి తోడు బీసీ డీ నుంచి ఏకు మార్చాలంటూ డిమాండ్ చేస్తున్నారు. ఈ అంశాలు అదే సామాజిక వర్గానికి చెందిన ఈటలకు కలిసి వచ్చాయి. గజ్వేల్ నియోజకవర్గంలో ముదిరాజుల ఓట్లు దాదాపు 45 వేల పై చిలుకు ఉన్నాయి. వారంతా ఈటలవైపే మొగ్గు చూపుతున్నట్లు తెలుస్తోంది.

గజ్వేల్ లో నెలకొన్న పరిస్థితుల గురించి ఇంటెలిజెన్స్ రిపోర్ట్ అందటంతో స్వయంగా రంగంలోకి దిగిన కేసీఆర్… నియోజకవర్గ నేతలు, పెద్దలతో సమావేశమయ్యారు. నేను మీతో ఉండలేక పోయాను… ఈ సారి గెలిపిస్తే ఇక నుండి నెలకు ఒక సారి సమావేశం ఏర్పాటు చేసుకొని సమస్యలు పరిష్కరించుకుందామని, ఎంత మెజారిటీతో గెలిపిస్తారో మీ దయ అనే పరిస్థితికి వచ్చారు. సమావేశానికి వెళ్లిన బిఆర్ఎస్ శ్రేణులు కేసీఆర్ తమను సమస్యలు అడిగి తెలుసుకుంటారని అనుకున్నారట.. కానీ అక్కడ అలా జరగకపోవడం పార్టీ శ్రేణులకు కొంత మేరకు నిరాశ చెందినట్లు తెలుస్తోంది. ఇక గురువారం ఒక వైపు ఈటల సభ జరుగుతుండగానే మంత్రి హరీశ్ రావు హుటాహుటిన గజ్వేల్ నియోజకవర్గానికి చేరుకుని ఆ పార్టీ కార్యకర్తలతో అత్యవసర సమావేశాన్ని నిర్వహించడం అధికార పార్టీలో నెలకొన్న భయానికి నిదర్శనంగా రాజకీయ విశ్లేషకులు భావిస్తన్నారు. మొత్తంగా గజ్వేల్ లో అధికార పార్టీకి వార్ వన్ సైడ్ అన్న దశ నుంచి ఈటల ఎంట్రీతో ఆసక్తికర పోరుకు తెరలేచింది.