తెలంగాణలో కాంగ్రెస్ పరిస్థితి ఏమిటీ…?

పోలింగ్ చివరి వారం కాంగ్రెస్ కి కలిసి రానుందా? ఆ ఏడు రోజులు కాంగ్రెస్ కీలక నేతలంతా తెలంగాణలో ఉండనున్నారా? ఆపరేషన్ తెలంగాణ పేరుతో సునీల్ కనుగోలు కొత్త అస్త్రాన్ని వదలనున్నరా? పరిస్థితి చూస్తుంటే అవుననే అంటున్నారు రాజకీయ విశ్లేషకులు.

తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడమే లక్ష్యంగా అధిష్టానం కసరత్తు చేస్తోంది. తెలంగాణ రాజకీయ పరిస్థితులు కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా ఉండటంతో తామే గెలుస్తామనే కాన్ఫిడెన్స్ లో ఉన్నారు హస్తం నేతలు. మరో వైపు కాంగ్రెస్ జాతీయ స్థాయి అగ్రనేతలు సైతం తెలంగాణలో పాగా వేసేందుకు నేరుగా రంగంలోకి దిగుతున్నారు. ఇప్పటికే అగ్రనేత రాహుల్ గాంధీ పలుమార్లు తెలంగాణలో పర్యటించారు. ఇటీవలే మూడు రోజుల పాటు పార్టీ బలహీనంగా ఉన్న ఉత్తర తెలంగాణ జిల్లాల్లో పర్యటించి.. క్యాడర్‌లో కొత్త జోష్ తీసుకొచ్చారు. తెలంగాణకి ఎంత సమయం ఇవ్వడానికైనా తాను సిద్ధమని రాహుల్ ప్రకటించారు. మరోవైపు రాష్ట్ర నేతలు సైతం డోర్ టు డోర్ ప్రచారంలో భాగంగా.. ఆరు గ్యారెంటీ స్కీమ్స్‌ను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్తున్నారు. ప్రభుత్వ వ్యతిరేకత తమకి అనుకూలంగా మారుతుండడంతో.. ప్రజల్లో మరింత బలంగా ఉండాలని కాంగ్రెస్ నేతలు వ్యూహాలు రచిస్తున్నారు.

ఇప్పటికే మొదటి దశ బస్సు యాత్రతో జోష్‌లో ఉన్న కాంగ్రెస్ నాయకులు.. 28న రెండో విడత బస్సు యాత్రకి సిద్ధమైంది. ఈ బస్సు యాత్రలో రాహూల్ గాంధీ, ప్రియాంక గాంధీతో పాటు కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ద రామయ్య, ఉప ముఖ్యమంత్రి డీకే శివ కుమార్ పాల్గొంటారని సమాచారం. ఉమ్మడి మెదక్, రంగారెడ్డి, మహబూబ్ నగర్ గుండా.. ఈ యాత్ర ఉండేలా సునీల్ టీం రూట్ మ్యాప్ సిద్ధం చేశారు.

మరోవైపు 5 రాష్ట్రాల్లో ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో.. 5 రాష్ట్రాలపై కాంగ్రెస్ ఫోకస్ చేస్తోంది. అన్ని రాష్ట్రాల పోలింగ్ అయిపోయిన వారం తర్వాత.. తెలంగాణ పోలింగ్ జరగనున్న నేపథ్యంలో.. ఆ వారం రోజులు తెలంగాణ కాంగ్రెస్ వాడుకోవాలని వ్యూహాన్ని రచిస్తోంది. చివరి వారం రోజుల ఆపరేషన్‌పై అధిష్టానం ప్రత్యేక కార్యాచరణ రూపోందిస్తుంది. నవంబర్ 23న రాజస్థాన్‌లో ఎన్నికలు ముగియనున్నాయి. 21తో ఆ రాష్ట్రంలో ప్రచారం ముగుస్తుండడంతో.. 22 నుండి ఏఐసీసీ పెద్దలంతా తెలంగాణలోనే ఉండనున్నట్లు సమాచారం. కాంగ్రెస్ అగ్రనేతలు సోనియా, రాహుల్, ప్రియాంక గాంధీ, ఖర్గేలతో పాటు కర్ణాటక, హిమాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రులు, వివిధ రాష్ట్రాల మాజీ ముఖ్యమంత్రులు, మాజీ కేంద్ర మంత్రులు.. మొత్తం తెలంగాణలోనే మాకాం వేసేలా అధిష్టానం ప్రణాళిక సిద్ధం చేస్తోంది. ఈ వారం రోజులు కాంగ్రెస్ అగ్రనేతలు తెలంగాణాలోనే ఉండడం.. తమ విజయానికి ఉపయోగపడుతుందని హస్తం నేతలు భావిస్తున్నారు.

అభ్యర్థుల ప్రకటన ఆలస్యంతో ప్రచారంలో వెనకబడ్డ కాంగ్రెస్.. చివరి వారం రోజుల్లో దాన్ని అధిగమిస్తామనే ధీమాతో ఉన్నారు హస్తం నేతలు. ఇక ఆపరేషన్ తెలంగాణ ఎలాంటి రిజల్ట్ ఇస్తుందో వేచి చూడాలి.