వరుస రైల్వే ప్రమాదాలకు కారణాలేమిటీ…?

ఘోర ప్రమాదాలు జరుగుతున్నా రైల్వేశాఖ గుణపాఠాలు నేర్చుకోవడంలేదు. ఇలాంటి దుర్ఘటనలు చోటుచేసుకోకుండా చర్యలు చేపట్టినట్లు కనిపించడంలేదు. దీంతో అమాయక ప్రయాణీకుల ప్రాణాలు గాల్లో కలుస్తున్నాయి. విజయనగరం జిల్లాలో జరిగిన రైలు ప్రమాదంతో మరోసారి రైల్వే అధికారుల తీరుపై తీవ్ర విమర్శలు వినిపిస్తున్నాయి. రెండు రైళ్లు ఢీకొనడంతో కంటకాపల్లి రైల్వేస్టేషన్ రక్తసిక్తమైంది. బాధితుల ఆహాకారాలతో ఆ ప్రాంతం దద్దరిల్లింది.

అలమండ స్టేషన్ కి కూతవేటు దూరంలో రైలు ఆగింది. అంతలోనే ఒక్కసారిగా గుండె పేలిపోయినంత పనైంది. హాహాకారాలు, అరుపులు, పసి పిల్లల ఏడ్పులతో విజయనగరం జిల్లాలోని కంటకాపల్లి రైల్వేస్టేషన్ భయానకంగా మారింది. ఆ ఘటన నుంచి తేరుకునే లోపే ఘోరం జరిగిపోయింది. కంటకాపల్లి రైల్వే స్టేషన్ కి సమీపంలోని ఆగిఉన్న పాసింజర్ రైలుని మరో రైలు వెనుక నుండి వచ్చి ఢీకొట్టడంతో ఈ ప్రమాదం చోటుచేసుకుంది.

కొన ఊపిరితో ఉన్న తమ వారిని కాపాడుకోవడానికి నానా ఇబ్బందిపడ్డారు. బాధితులను తమ భుజాలపై వేసుకొని పరుగులు తీశారు. ఎటుచూసినా గుండెలు పిండే కన్నీటి దృశ్యాలు కళ్లముందు కనిపించాయి. ఇంతలో సమాచారం అందుకున్న రైల్వే, జిల్లా యంత్రంగం సంఘటనా స్థలానికిచేరుకొని సహాయక చర్యలు చేపట్టాయి. విశాఖ నుండి చేరుకున్న రైల్వే అధికారులు, సిబ్బంది, పోలీసులు, స్థానిక ప్రజలు పెద్ద ఎత్తున సహాయ సహకారాలు అందించారు. రైలు పట్టాలపైన, రైలు పెట్టెలలో విగత జీవులుగా పడివున్న పలు మృతదేహాలను గుర్తించారు. సమీపంలో ఉన్న తోటలోకి తరలించారు. పోస్టుమార్టం కోసం విజయనగరం ఆసుపత్రికి తరలించారు. తీవ్రగాయాలపాలైన వారిలో కొందరిని విశాఖపట్నం తరలించి చికిత్స అందించారు.

ఆసుపత్రిలో చికిత్సపొందుతున్న వారి కష్టాలు ఒక వైపు, శవాగారం దగ్గర మృతదేహాల వద్ద బంధువుల ఆర్థనాదాలు మరోవైపు అక్కడి ప్రాంతం హృదయ విదారకంగా మారింది. ఎవరిని కదిపినా కన్నీటి సమాధానమే ఎదురైంది. రైల్వే శాఖ నిలువెత్తు నిర్లక్ష్యాన్ని నిలదీస్తున్నాయి.

ఆసుపత్రికి ముఖ్యమంత్రి వస్తున్నారని తెలిసిన వెంటనే సుమారు 5 గంటల పాటు ఆ పరిసరాలను పోలీసులు అష్ట దిగ్భందం చేశారు. ఆసుపత్రిలోని తమ రోగులకు నీళ్లు, పాలు ఇవ్వాలన్నా రోగుల సహాయకులను సైతం కట్టడి చేశారు. బాధిత కుటుంబసభ్యుల దగ్గరకు వచ్చిన ముఖ్యమంత్రి జగన్ అందరినీ పలుకరించి వచ్చిన తోవనే పయనమయ్యారు. సహకారం ఇస్తామని చెప్పారని వాపోయారు.

కేంద్ర, రాష్ర్ట ప్రభుత్వాల తీరుని ప్రతిపక్షాలు తప్పుపట్టాయి. ఒరిస్సాలోని ఘోర రైలు ప్రమాద ఘటన మరువక ముందే విజయనగరం జిల్లాలో రైలు దుర్ఘటన 14 మంది ప్రాణాలు గాలిలో కలిపేయటాన్ని రైలు ప్రయాణీకులు, ప్రజలు రైల్వే శాఖను తప్పుపడుతున్నారు. నిర్లక్ష్యానికి ప్రతి రూపంగా నిలుస్తున్నాయనే విమర్శలు గట్టిగానే వినిపిస్తున్నారు. ఘోరమైన ఘటనలు జరిగినప్పుడు హడావిడి చేయటం… ఆ తరువాత వదిలెయ్యడాన్ని తప్పుపడుతున్నారు.

రైల్వే ప్రమాదంతో చిన్నాభిన్నమైన పట్టాలను అధికారులు పునరుద్దరించారు. పాడైన రైలు బోగీలను తొలగించి.. బాగుచేసిన పట్టాలపై గూడ్స్‌ రైలును నడిపారు. ఆతర్వాత పూర్తిస్థాయిలో హౌరా- చెన్నై ప్రధాన ట్రాక్‌పై ప్రశాంతి ఎక్స్‌ప్రెస్‌ను నడిపారు. అయితే పేద, మధ్య తరగతి ప్రయాణీకులకు ప్రయోజనకారిగా పేరున్న రైల్వే శాఖ… వరుస ప్రమాదాలతో తీవ్ర విమర్శలకు గురవుతోంది. ఈ నేపథ్యంలో ప్రణాళికాబద్ధంగా నష్ట నివారణ చర్యలు చేపట్టవలసిన అవసరం ఎంతైనా వుందని ప్రజలు కోరుతున్నారు.