`గేమ్ ఛేంజ‌ర్‌` ఫ‌స్ట్ సింగిల్ బ‌డ్జెట్ ఎంతో తెలుసా.. ఆ పాట ఖ‌ర్చుతో 4 సినిమాలు తీయొచ్చు!

ఆర్ఆర్ఆర్ మూవీతో గ్లోబ‌ల్ స్టార్ గా గుర్తింపు సంపాదించుకున్న మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్‌.. ప్ర‌స్తుతం శంక‌ర్ ద‌ర్శ‌క‌త్వంలో `గేమ్ ఛేంజ‌ర్‌` అనే సినిమా చేస్తున్న సంగ‌తి తెలిసిందే. పొలిటిక‌ల్ యాక్ష‌న్ థ్రిల్ల‌ర్ గా రూపుదిద్దుకున్న ఈ చిత్రంలో రామ్ చ‌ర‌ణ్ ద్విపాత్రాభిన‌యం చేస్తున్నాడు. కియారా అద్వానీ, అంజ‌లి హీరోయిన్లుగా న‌టిస్తే.. శ్రీ‌కాంత్‌, స‌ముద్ర‌ఖ‌ని, ఎస్‌.జె. సూర్య‌, సునీల్, జ‌య‌రామ్ త‌దిత‌రులు కీల‌క పాత్ర‌ల‌ను పోషిస్తున్నారు.

థ‌మ‌న్ స్వ‌రాలు అందిస్తుండ‌గా.. దిల్ రాజు నిర్మాత‌గా వ్య‌వ‌హరిస్తున్నారు. ఈ మూవీ షూటింగ్ ఆల్మోస్ట్ ఆఖ‌రి ద‌శ‌కు చేరుకుంది. వ‌చ్చే ఏడాది ఆరంభంలో గేమ్ ఛేంజ‌ర్ పాన్ ఇండియా స్థాయిలో విడుద‌ల అవ్వబోతోంది. అయితే ఈ సినిమా ఫ‌స్ట్ సింగిల్ `జ‌ర‌గండి..` పాట ద‌స‌రా రావాల్సి ఉంది. పోస్ట‌ర్ కూడా బ‌య‌ట‌కు వ‌చ్చింది. కానీ, ప‌లు కార‌ణాల వ‌ల్ల దీపావ‌ళికి వాయిదా వేశారు.

అయితే ఈ సాంగ్ బ‌డ్జెట్ ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. శంక‌ర్ సినిమాల్లో సాంగ్స్ ఎంత గ్రాండ్ గా ఉంటాయో ప్ర‌త్యేకంగా చెప్ప‌క్క‌ర్లేదు. గేమ్ ఛేంజర్ ఆల్బమ్ కూడా చాలా రిచ్ గా మ‌రియు క్వాలిటీగా ఉండబోతోంది. ఈ నేప‌థ్యంలో శంక‌ర్ `జ‌ర‌గండి` సాంగ్ కోసం ఏకంగా రూ. 20 కోట్ల వ‌ర‌కు ఖ‌ర్చు పెట్టాడ‌ట‌. ఈ విష‌యం తెలిసి నెటిజ‌న్లు షాకైపోతున్నారు. ఆ ఒక్క పాట ఖ‌ర్చుతో నాలుగు చిన్న సినిమాలు తీయొచ్చని కామెంట్లు పెడుతున్నారు. కాగా, ఇటీవల షారుక్‌ ఖాన్‌ నటించిన జవాన్‌ సినిమాలో `జిందా బందా` సాంగ్‌ కోసం రూ. 15 కోట్లు ఖర్చు పెట్టారు. కానీ, ఇప్పుడు ఈ రికార్డును చ‌ర‌ణ్ చిత్తు చేసేశాడ‌నే చెప్పాలి.