ఏపీలో బీజేపీ అడుగులు ఎటు వైపు…?

వచ్చే ఎన్నికల్లో టీడీపీ, జనసేనతో పొత్తుపై ఆంధ్రప్రదేశ్‌ కమలనాథులు ఎటూ తేల్చుకోలేకపోతున్నారు. కలిసి వస్తారా.. లేక ఫ్యాన్ కిందే సేద తీరుతారా.. అన్న చర్చ జరుగుతోంది. ఇటీవల రాజమండ్రిలో జరిగిన టీడీపీ, జనసేన సమన్వయ కమిటీ సమావేశంలో బీజేపీ తీరు ప్రస్తావనకు వచ్చింది. జగన్ పై ప్రేమను చంపుకోలేక, టీడీపీని కాదనలేక బీజేపీ నేతలు డైలమాలో ఉన్న విషయాన్ని తెలుగుదేశం నేత ప్రస్తావించారు. ఎన్‌డీఏలో కొనసాగుతున్న పవన్‌ కల్యాణ్‌ కు ఏం చెప్పాలో అర్థంకాక కమలనాథులు సమతమవుతున్నారని ఆ నేత చెప్పడం చర్చనీయాంశంగా మారింది. టీడీపీ, జనసేన నేతలు మాత్రం బీజేపీతో పొత్తు లేకపోతేనే మంచిదని అంతర్గతంగా భావిస్తున్నారు. రెండు పార్టీలు ఈ నిర్ణయానికి రావడానికి కారణం ఏంటి..? అసలు సమన్వయ కమిటీ భేటీలో ఏం జరిగింది..?

తెలుగుదేశం, జనసేన పొత్తు ఇప్పుడు రాష్ట్ర రాజకీయాల్లో కీలక పరిణామంగా మారింది. ఈ నిర్ణయం బీజేపీని మాత్రం ఎటూ తేల్చుకోలేని స్థితిలోకి నెట్టింది. బాల్ బీజేపీ కోర్ట్ లోనే ఉందని, తేల్చుకోవాల్సింది వారేనని జనసేన కీలక నేత చెప్పడం హాట్ టాపిక్‌గా మారింది. చంద్రబాబు అరెస్ట్‌ తర్వాత రాజమండ్రి సెంట్రల్‌ జైల్లో టీడీపీ అధినేతను పరామర్శించిన పవన్‌ కల్యాణ్‌.. ఎంతో భావోద్వేగానికి గురయ్యారు. అక్కడికక్కడే వచ్చే ఎన్నికల్లో కలిసి పోటీ చేద్దామన్న విషయాన్ని చంద్రబాబుతో ప్రస్తావించారు. ఇప్పుడే ఆ విషయం ఎందుకని చంద్రబాబు పవన్‌తో చెప్పగా, తాను నిర్ణయం తీసుకున్నానని జనసేనాని చెప్పిన వెంటనే టీడీపీ అధినేత కూడా అలానే కానిద్దామని చెప్పారు. ఆ తరువాత జైలు నుంచి బయటకు వచ్చి పవన్‌ కల్యాణ్‌.. టీడీపీ నేతలు లోకేష్, బాలకృష్ణ సమక్షంలో పొత్తు విషయాన్ని ప్రకటించారు.

పొత్తు విషయంలో బీజేపీ పెద్దలతో కూడా తాను ఢిల్లీ వెళ్లి మాట్లాడుతానని, సాధ్యమైనంత వరకూ ఒప్పిస్తానని అప్పట్లోనే జనసేనాని చెప్పారు. పొత్తు నిర్ణయం ఎందుకు తీసుకోవాల్సి వచ్చిందో హస్తినలో కమలనాథులకు వివరిస్తారనన్న అంశంపై రాజకీయంగా పెద్ద చర్చ జరిగింది. బీజేపీ నేతలు కూడా ఐదు రాష్ట్రాల ఎన్నికల హడావుడిలో ఉన్నారు. ఈ నేపథ్యంలోనే తెలంగాణలో పోటీ చేయాలని జనసేన భావించింది. కానీ తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు కిషన్ రెడ్డి, ఆపార్టీ ఎంపీ లక్ష్మణ్ తమకు మద్దతు ఇవ్వాలని కోరారు. కానీ పవన్‌ కళ్యాణ్‌ మాత్రం అంగీకరించలేదు. ఈ నేపథ్యంలో ఢిల్లీ వెళ్లిన పవన్‌ కల్యాణ్‌.. తెలంగాణతో పాటు ఏపీల్లో పొత్తుల అంశంపై బీజేపీ పెద్దలతో చర్చించినట్టు సమాచారం. రాజమండ్రిలో జరిగిన జనసేన, టీడీపీ సమన్వయ కమిటీ సమావేశలోనూ పొత్తు అంశం ప్రస్తావనకు వచ్చింది. చంద్రబాబు విజన్, అనుభవం.. రాష్ట్రానికి అవసరమని చెప్పడమే కాకుండా, ఎలా కలిసి పనిచేయాలన్న అంశం పై కూడా చర్చ జరిగింది. పవన్‌ చేసిన పలు ప్రతిపాదనలకు టీడీపీ నేతలు అంగీకరించి ముందుకు సాగాలన్న నిర్ణయానికి వచ్చారు.

టీడీపీ, జనసేన సమన్వయ కమిటీ సమావేశంలో బీజేపీ వ్యవహారం కూడా చర్చకు వచ్చింది. బీజేపీ సంగతి ఏంటని టీడీపీ నేత ప్రస్తావించగా, తాను ఇప్పటికీ ఎన్‌డిఏలోనే ఉన్నానని, కలిసి వస్తే 2014 తరహాలోనే మూడు పార్టీల కాంబినేషన్ లో పోటీ చేద్దామని పవన్‌ చెప్పినట్టు సమాచారం. లేనిపక్షంలో రెండు పార్టీల పొత్తుతో ముందుకు వెళ్దామని కూడా జనసేనాని చెప్పినట్టు రాజకీయవర్గాల్లో వినిపిస్తోంది. కమలనాథులు కలిసి వస్తారన్న ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. అయితే వారాహి యాత్రలో పెడన సభలో పవన్‌ వ్యాఖ్యానించిన విధంగా బీజేపీతో కలిసి వెళితే ఓట్లు వస్తాయేమో కానీ… అసెంబ్లీకి వెళ్లేందుకు అవసరమైన సీట్లు రావని చెప్పిన విషయాన్ని గుర్తు చేసుకోవాలి. సమన్వయ కమిటీ భేటీలో కూడా ఇరుపక్షాల నేతల మధ్య దాదాపుగా ఇలాంటి చర్చే జరిగిందని సమాచారం. బీజేపీ పట్ల ప్రజల్లో వ్యతిరేత ఉందని.., చంద్రబాబు అరెస్ట్ వెనుక బీజేపీ ఉందని జనం బలంగా నమ్ముతున్నారన్న విషయాన్ని టీడీపీ నేత ప్రస్తావించినట్టు వినిపిస్తోంది. కేంద్రానికి తెలియకుండా ముఖ్యమంత్రి జగన్.. ప్రతిపక్ష నేత చంద్రబాబును అరెస్ట్ చేసి ఉండరని కూడా ప్రజల్లో విస్తృతంగా చర్చ జరుగుతోందని ఆ నేత సమావేశం దృష్టికి తెచ్చినట్టు సమాచారం. దీనిపై స్పందించిన జనసేనాని.. టీడీపీ, జనసేనతో పొత్తు పెట్టుకోవాలా.. లేదా.. అన్న విషయాన్ని ఢిల్లీలో బీజేపీ పెద్దలు నిర్ణయించుకుంటారని చెప్పినట్టు చర్చ జరుగుతోంది. ఐదు రాష్ట్రాల ఎన్నికల హడావుడి తరువాత ఏం జరుగుతుందో చూద్దామని జనసేన అధినేత పవన్‌ అన్నట్టు సమాచారం. బీజేపీ కూడా కలిసి వస్తే మంచిది… రానిపక్షంలో కలిసి పోరాడదామని, అంతిమ విజయం టీడీపీ, జనసేనదేనని పవన్‌ కల్యాణ్‌.. ధీమా వ్యక్తం చేసినట్టు చర్చ జరుగుతోంది.