చంద్రబాబు ఎప్పుడు విడుదలవుతారు…?

తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు ఎప్పుడు విడుదల అవుతారు..? సుప్రీంకోర్టు తీర్పు ఎప్పుడొస్తుంది..? తీర్పు ఎలా వస్తుంది..? ఏం జరగబోతోంది..? ఎక్కడా చూసినా కూడా ఇదే చర్చ. ఈనెల 30 నుంచి సుప్రీంకోర్టు పునఃప్రారంభమవుతోంది. ఏపీ హైకోర్టులో వెకేషన్ బెంచ్‌కు చంద్రబాబు బెయిల్ పిటిషన్ బదిలీ చేయాలని ఆయన తరపు న్యాయవాదులు కోరగా, ఇప్పుడు ఏపీ హైకోర్టులో ఏం జరగబోతోందనే చర్చ కూడా అందరిలో ప్రారంభమైంది. అసలు చంద్రబాబు ఎప్పుడు విడుదల అవుతారని, కోర్టు తీర్పులు ఏం చెబుతాయోనని సర్వత్ర ఉత్కంఠ మొదలైంది.

చంద్రబాబు నాయుడుపై వివిధ కోర్టుల్లో ఉన్న కేసులపై ఇప్పుడు ఏపీలో ఎడతెగని చర్చ జరుగుతోంది. కోర్టుల్లో పడుతున్న వాయిదాలు, సుప్రీంకోర్టులో క్వాష్ పిటీషన్‌పై వాదనలు ముగిసి.. తీర్పు రిజర్వ్ చేశారు. స్కిల్ కేసులో బెయిల్‌ పిటీషన్‌పై ఏపీ హైకోర్టులో కూడా వాదనలు జరగాల్సి ఉంది. మొన్న ఆరోగ్య కారణాల దృష్ట్యా మధ్యంతర బెయిల్ ఇవ్వాలని కోరారు. తిరిగి మధ్యాహ్నం విచారణ ప్రారంభమైన వెంటనే.. ఈ పిటీషన్‌పై విచారణను వెకేషన్ బెంచ్‌కు బదిలీ చేయాలని చంద్రబాబు తరఫు న్యాయవాదులు విజ్ఞప్తి చేశారు. ఈసారి వాయిదా నాటికి చంద్రబాబు ఆరోగ్య పరిస్థితిపై నివేదిక కోర్టు ముందు ఉంచాలని విచారణను న్యాయమూర్తి వెకేషన్ బెంచ్‌కు బదిలీ చేశారు. శుక్రవారం వెకేషన్ బెంచ్ ముందు ఈ కేసు విచారణకు రానుంది. ఏం జరుగుతుందనేది ఆసక్తికరంగా మారింది. ఇక ఏపీ ఫైబర్ నెట్ కేసులో సుప్రీంకోర్టులో చంద్రబాబు తరపు న్యాయవాదులు ఆయనకు ముందస్తు బెయిల్ ఇవ్వాలని పిటీషన్ వేశారు. దీనిపై విచారణను సుప్రీంకోర్టు నవంబర్ 9కి వాయిదా వేసింది. ఈలోపు క్వాష్‌ పిటీషన్‌పై తీర్పు ఇస్తామని, ఆ తరువాత విచారిద్దామని స్పష్టం చేసింది. ఇన్నర్ రింగ్ రోడ్డు అలైన్మెంట్ కేసులో చంద్రబాబు ముందస్తు బెయిల్ పిటీషన్‌పై.. విచారణను చంద్రబాబు తరపు న్యాయవాదుల అభ్యర్దన మేరకు.. నవంబర్ 7న హైకోర్టు వాయిదా వేసింది. అటు సుప్రీంకోర్టు, ఇటు హైకోర్టు ఇచ్చిన ఆదేశాలతో విజయవాడ ఏసీబీ కోర్టులో ఏపీ ఫైబర్ నెట్, ఇన్నర్ రింగ్ రోడ్డు అలైన్మెంట్ కేసులో పీటీ వారెంట్‌లు కూడా అమలు చేయవద్దని సీఐడీ మెమో దాఖలు చేసింది. దీంతో.. ఇక్కడ ఏసీబీ కోర్టులో ఫైబర్ నెట్ కేసులోని పీటీ వారెంట్ కింద చంద్రబాబును హాజరుపెట్టడం కూడా వాయిదా పడింది.

దసరా సెలవుల అనంతరం ఈనెల 30న సుప్రీంకోర్టు పునఃప్రారంభంకానుంది. అదే రోజు తీర్పు ఇస్తారా, లేక మొదటి వారంలో తీర్పు ప్రకటిస్తారా అనేది తేలాల్సి ఉంది. రేపో, మాపో 30వ తేదీ కేసుల జాబితా విడుదల కానుంది. సుప్రీంకోర్టులో క్వాష్ పిటీషన్‌పై నాలుగు రోజుల పాటు సుదీర్ఘ వాదనలు కొనసాగాయి. ఇరుపక్షాల వాదనల అనంతరం తీర్పును సుప్రీంకోర్టు రిజర్వ్ చేసింది. ఇదే సమయంలో ఏపీ ఫైబర్ నెట్ కేసు కూడా విచారణకు వచ్చింది. క్వాష్ పిటీషన్‌పై తీర్పు అనంతరం ఈ కేసును విచారిస్తామని నవంబర్‌ 9కి విచారణను వాయిదా వేసింది. అప్పటి వరకూ ఫైబర్ నెట్ కేసులో విజయవాడ ఏసీబీ కోర్టులో పీటీ వారెంట్‌పై ఎటువంటి చర్యలు తీసుకోవద్దని.. అంతకుముందు సిఐడీ తరపు న్యాయవాదులు ఇచ్చిన అండర్ టేకింగ్‌కు కట్టుబడి ఉండాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. అవినీతి నిరోదక చట్టంలోని 17-ఏ చంద్రబాబుకు వర్తిస్తుందా లేదా అనే అంశంపై.. రాజ్యాంగ పరమైన అంశాలు చట్ట, న్యాయపరమైన విషయాలు కూడా ఉండటంతో.. సుప్రీం ధర్మాసనం ఇరువురు సీనియర్ న్యాయవాదుల నుంచి.. లిఖితపూర్వక వాదనలు కూడా ఇవ్వాలని ఆదేశించింది.

అవినీతి నిరోధక చట్టంలోని 17-ఏ చంద్రబాబుకు వర్తిస్తుందని తీర్పు వస్తే.. చంద్రబాబు వెంటనే విడుదల అయ్యే అవకాశం ఉంది. నవంబర్ మొదటి వారంలో తీర్పు వస్తుందని భావిస్తున్నారు. ఒకవేళ చంద్రబాబుకు వ్యతిరేకంగా తీర్పు వస్తే.. ఈ మూడు కేసుల్లో కూడా బెయిల్ కోసం మళ్లీ కింది కోర్టు నుంచి.. ప్రయత్నాలు ప్రారంభించాల్సి ఉంటుంది. అయితే.. ఏపీ ఫైబర్ నెట్ కేసులో సుప్రీంకోర్టులో ముందస్తు బెయిల్ పిటీషన్, హైకోర్టులో స్కిల్‌ కేసులో బెయిల్ పిటిషన్‌, ఐఆర్‌ఆర్‌ అలైన్మెంట్ కేసులో ముందస్తు బెయిల్ పిటీషన్‌లు పెండింగ్‌లో ఉన్నాయి. క్వాష్‌ పిటీషన్‌పై సుప్రీం తీర్పు చంద్రబాబుకు వ్యతిరేకంగా వస్తే ఆయనపై మరికొన్ని కేసులు కూడా నమోదు చేసేందుకు.. ప్రభుత్వం సిద్దమవుతోందని అధికార పార్టీ నేతలు ఆఫ్ ది రికార్డ్‌గా చెబుతున్నారు.