ఆ సీటు కోసం వైసీపీ ఎమ్మెల్యే సోదరుడి ప్రయత్నం…!

గురజాల నియోజకవర్గంలో అధికార పార్టీ ఎమ్మెల్యేకి బలహీనవర్గాలంటే గిట్టేది కాదనే మాట బలంగా వినిపిస్తోంది. బీసీ ఎమ్మెల్సీ, కార్పొరేషన్‌ చైర్మన్లకు అధికార కార్యక్రమాలకు ఆహ్వానాలు అందేవికావు. కనీస గౌరవం ఇచ్చే వారు కాదు. ప్రభుత్వ కార్యక్రమాల్లో ప్రొటోకాల్‌ పాటించేవారు కాదు. కానీ ఇప్పుడా ఎమ్మెల్యే బలహీనవర్గాల నినాదాన్ని అందుకున్నారు. ఎన్నికలు సమీపిస్తున్న సమయంలో ఒక్కసారిగా మార్పు రావడానికి కారణం ఏంటి..?

పల్నాడు జిల్లా గురజాల నియోజకవర్గం అన్ని పార్టీలకు కీలకం. ఈ స్థానం నుంచి వైసీపీ ఎమ్మెల్యే కాసు మహేష్‌ రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. మహేష్ రెడ్డి ఇటీవల చేసిన వ్యాఖ్యలు జిల్లా వ్యాప్తంగా చర్చకు దారి తీశాయి. గురజాల నియోజకవర్గంలో జరిగిన ఓ కార్యక్రమంలో 10 శాతం కూడా లేని కమ్మ, రెడ్డి సామాజివర్గాలకేనా అన్ని పదవులు.. అని ప్రశ్నించడం హాట్‌ టాపిక్‌గా మారింది. మిగిలిన 90 శాతం మంది సామాజికవర్గాల పరిస్థితి ఏంటని మహేష్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై నియోజకవర్గం ప్రజల్లో చర్చనీయాంశంగా మారింది. గత ఎన్నికల్లో బీసీ సామాజికవర్గానికి చెందిన జంగా కృష్ణమూర్తిని పక్కనపెట్టి.. కాసు మహేష్‌ రెడ్డి ఎమ్మెల్యే సీటు తెచ్చుకున్నారు. ఇప్పుడు బలహీనవర్గాల నినాదాన్ని అందుకున్న కాసుకు.. అప్పుడు ఈ 90 శాతం బలహీనవర్గాలు గుర్తుకురాలేదా.. అని ప్రశ్నిస్తున్నారు.

వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత జంగా కృష్ణమూర్తికి ఎమ్మెల్సీ పదవి దక్కింది. అప్పట్లో ఎమ్మెల్సీకి శుభాకాంక్షలు తెలిపే ఫ్లెక్సీలు కూడా పెట్టకుండా మహేష్‌రెడ్డి అడ్డుకున్నారన్న విమర్శలు ఉన్నాయి. కొన్ని చోట్ల అనుమతి లేకుండా ఫ్లెక్సీలు పెట్టారంటూ.. అధికారులపై ఒత్తిడి తెచ్చి తొలగించాలని ఆదేశించడం వివాదాస్పదంగా మారింది. దీంతో ఎమ్మెల్యే మహేష్‌రెడ్డి బీసీల ఆగ్రహానికి గురికాక తప్పలేదు. గురజాల నియోజకవర్గంలో ఏ అధికారికి కార్యక్రమానికి ఎమ్మెల్సీకి ఆహ్వానం లేకుండా చేయడంలో కీలక పాత్ర పోషించారు. జంగా కృష్ణమూర్తికి ఆహ్వానం పంపిన అధికారులను వేధింపులకు గురిచేసిన సందర్భాలు లేకపోలేదు.

ఇక గురజాల నియోజకవర్గానికి చెందిన వడ్డెర కార్పొరేషన్ చైర్‌పర్సన్‌ దేవళ్ల రేవతికి కూడా ఏ అధికార కార్యక్రమాల్లో ప్రొటోకాల్‌ లేదు. ఎమ్మెల్సీ జంగా కృష్ణమూర్తితో పాటు.. వడ్డెర కార్పొరేషన్‌ చైర్‌పర్సన్‌కు.. ఎమ్మెల్యే మహేశ్‌రెడ్డి కనీస గౌరవం ఇవ్వలేదన్న విమర్శలు ఉన్నాయి. కానీ ఎన్నికలు సమీపిస్తున్న సమయంలో శానససభ్యుడి స్వరం మారింది. వచ్చే ఎన్నికల్లో తనకు సీటు రాదని, ఇచ్చిన గెలిచే పరిస్థితి లేకపోవడంతో సామాజిక న్యాయంపై ఉపన్యాసాలు ఇవ్వడం చర్చనీయాంశంగా మారింది. వారిని మచ్చిక చేసుకునేందుకు ప్రయత్నిస్తున్నారన్నం వాదనలు ఉన్నాయి. గురజాల ఎమ్మెల్యే మహేష్‌రెడ్డి హఠాత్తుగా బీసీ నినాదం అందుకోవడంలో ఆంతర్యం లేకపోలేదు. పల్నాడు జిల్లాలో తన సొంత సామాజికవర్గానికే చెందిన ఓ వైసీపీ ఎమ్మెల్యే సోదరుడు గురజాల సీటు పై కన్నేసినట్లు ప్రచారం జరుగుతోంది. దీనిని ముందే పసిగట్టిన ఎమ్మెల్యే కాసు మహేష్ రెడ్డి తనకు దక్కని సీటు.. తమ సామాజికవర్గంలో మరెవ్వరికి దక్కకూడదనే ఉద్దేశ్యంతో ఈ వ్యాఖ్యలు చేసి ఉంటారన్న చర్చ సాగుతోంది. మరి వచ్చే ఎన్నికల నాటికి పరిస్థితి ఎలా ఉంటుంది. సీటు ఎవరికి వస్తుంది అనేది వేచి చూడాలి. ఒక వేళ కాసు మహేష్ రెడ్డి కే అధిష్టానం గురజాల నియోజకవర్గం సీటు మరోసారి కేటాయిస్తే… తనకి వద్దని 90 శాతం ఉన్న బీసీలు, ఎస్సీ, ఎస్టీలకు ఇవ్వాలని కోరతారా.. అన్న అంశంపై ప్రజల్లో చర్చ జరుగుతోంది.