విడుద‌ల‌కు ముందే రూ. 3.5 కోట్లు న‌ష్టపోయిన `భ‌గ‌వంత్ కేస‌రి`.. అస‌లేం జ‌రిగిందంటే?

న‌ట‌సింహం నంద‌మూరి బాల‌కృష్ణ మ‌రికొన్ని గంట‌ల్లో `భ‌గ‌వంత్ కేస‌రి` మూవీతో ప్రేక్ష‌కుల‌ను ప‌ల‌క‌రించ‌బోతున్న సంగ‌తి తెలిసిందే. అనిల్ రావిపూడి డైరెక్ట్ చేసిన ఈ చిత్రంలో బాల‌య్య‌కు జోడీగా ఫ‌స్ట్ టైమ్ కాజ‌ల్ అగ‌ర్వాల్ న‌టించింది. యంగ్ బ్యూటీ శ్రీ‌లీల, అర్జున్ రాంపాల్ త‌దిత‌రులు కీల‌క పాత్ర‌ల‌ను పోషించారు. థ‌మ‌న్ స్వ‌రాలు స‌మ‌కూర్చారు. షైన్ స్క్రీన్ బ్యానర్‌పై సాహు గార‌పాటి నిర్మించిన ఈ సినిమా అక్టోబ‌ర్ 19న అట్ట‌హాసంగా విడుద‌ల కాబోతోంది.

ఈ సినిమాపై భారీ రేంజ్ లో అంచ‌నాలు ఉన్నాయి. అడ్వాన్స్ బుక్కింగ్స్ కూడా అదిరిపోయే లెవ‌ల్ లో జ‌రుగుతున్నాయి. మ‌రోవైపు థియేట‌ర్స్ వ‌ద్ద నంద‌మూరి ఫ్యాన్స్ హంగామా కూడా షురూ అయింది. అఖండ‌, వీర సింహారెడ్డి సినిమాల‌తో బ్యాక్ టు బ్యాక్ హిట్స్ అందుకున్న బాల‌య్య‌.. భ‌గ‌వంత్ కేస‌రితో హ్యాట్రిక్ కొట్టాల‌ని ఆశ‌ప‌డుతున్నారు. అంత‌కు త‌గ్గ‌ట్లుగానే ప్ర‌మోష‌న్స్ కూడా నిర్వ‌హిస్తున్నారు. ఇదిలా ఉంటే.. తాజాగా ఈ సినిమాకు సంబంధించి ఓ షాకింగ్ న్యూస్ తెర‌పైకి వ‌చ్చింది.

అదేంటంటే.. విడుద‌ల‌కు ముందే భ‌గ‌వంత్ కేస‌రి మూవీకి రూ. 3.5 కోట్ల న‌ష్టం వాటిల్లింద‌ట‌. అస‌లేం జ‌రిగిందంటే.. అనిల్ రావిపూడి ఈ సినిమాలో బాలయ్య సూపర్ హిట్ సాంగ్ `దంచవే మేనత్త కూతురా`ని రీమిక్స్ చేశారు. ఇందుకు మూడున్న‌ర కోట్లు ఖ‌ర్చు పెట్టారు. అయితే తాజాగా బాలయ్య ఫ్యామిలీకి, ఇండస్ట్రీలో కొందరు ప్రముఖులకు భగవంత్ కేసరి చిత్రాన్ని స్పెషల్ ప్రీమియర్ గా ప్రదర్శించార‌ట‌. అంద‌రి నుంచి సినిమాకు పాజిటివ్ టాక్ ల‌భించింది. కానీ, రీమిక్స్ చేసిన‌ సాంగ్ మాత్రం కథ ఫ్లోని దెబ్బతీసే విధంగా ఉంద‌ని చాలా మంది చెప్పార‌ట‌. దాంతో అనిల్ బాగా ఆలోచించి ఆ పాట‌ను పైన‌ల్ క‌ట్ లో లేపేశాడు. దాంతో ఈ సాంగ్ బ‌డ్జెట్ బూడిద‌లో పోసిన ప‌న్నీరు అయింద‌ని అంటున్నారు.