బాలినేని అలకకు కారణం అదేనా…!

ఒంగోలు వైసీపీలో ముసలం పుట్టింది… సీఎం సమీప బంధువు, ఒంగోలు ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాస రెడ్డి తీవ్ర అసంతృప్తిలో ఉన్నారు. ఇప్పటికే గన్‌మెన్‌లను సరెండర్‌ చేసిన బాలినేని తాజాగా సీఎంఓ ముఖ్య కార్యదర్శి ధనుంజయ్‌ రెడ్డితో భేటీ అయ్యారు. భూ కబ్జాలకు పాల్పడిన వారిపై చర్యలు తీసుకోవాలని బాలినేని డిమాండ్‌ చేశారు.

సీఎం సమీప బంధువు, ఒంగోలు ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాస రెడ్డి తాడేపల్లిలోని సీఎం క్యాంప్ కార్యాలయానికి వచ్చారు. ఉదయమే తాడేపల్లి చేరుకున్న బాలినేని సాయంత్రం వరకూ లోపలే ఉన్నారు. ఒంగోలులో భూకబ్జా వ్యవహారంలో అధికారుల వైఖరిని నిరసిస్తూ ఎమ్మెల్యే బాలినేని తనకున్న సెక్యూరిటీని కూడా ప్రభుత్వానికి సరండర్ చేశారు. అధికారుల వైఖరి పట్ల తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. తనకు సెక్యూరిటీ వద్దని ఏకంగా డీజీపీకి లేఖ రాశారు. ఈ నేపథ్యంలోనే బాలినేని శ్రీనివాస రెడ్డిని ముఖ్యమంత్రి పిలిపించారు. మంత్రివర్గ విస్తరణ సందర్భంగా మంత్రి పదవి నుంచి తప్పించడంతో తీవ్ర అసంతృప్తిగా ఉన్న బాలినేని శ్రీనివాస రెడ్డిని అప్పట్లో ముఖ్యమంత్రి, ప్రభుత్వ ప్రధాన సలహాదారుడు సజ్జల రామకృష్ణారెడ్డి పిలిపించి బుజ్జగించారు. ఆ తరువాత ఆయన పార్టీ రీజినల్ కోఆర్డినేటర్‌ పదవికి కూడా రాజీనామా చేశారు. ఒంగోలు డీఎస్‌పీని తనకు తెలియకుండా బదిలీ చేయడం పట్ల, తనతో వైరం ఉన్న బావ వైవీ సుబ్బారెడ్డి మనిషిని ఒంగోలు డీఎస్‌పీగా నియమించడం పై భగ్గుమన్నారు. ఈ అంశం అప్పట్లో తీవ్ర సంచలనం రేకెత్తించింది. చివరకు ఈ వివాదంలో బాలినేని శ్రీనివాస రెడ్డిని సీఎం పిలిపించి బుజ్జగించి డీఎస్‌పీని కొనసాగించారు. అప్పటి నుంచి కూడా బాలినేని అసంతృప్తిగా ఉన్నా ఎక్కడా బయటపడలేదు. తాజాగా బాలినేని శ్రీనివాస్ రెడ్డి వివాదం ఇప్పుడు సీఎంకు తలనొప్పిగా మారింది.

ఒంగోలులో రబ్బర్ స్టాంప్‌లు, రిజిస్ట్రేషన్‌ దస్తావేజులతో భూకబ్జాదారులు అడ్డంగా దొరికినా… వారి పై చర్యలు తీసుకోకపోవడం పట్ల ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాస రెడ్డి అసంతృప్తిగా ఉన్నారు. అసలు ఈ భూకబ్జాల వ్యవహారం ఎమ్మెల్యేకి తెలయకుండానే జరుగుతుందా అని ప్రజలు అనుకుంటున్నారని సీఎంఓ ముఖ్య కార్యదర్శి ధనుంజయ్ రెడ్డిని కలిసి ఆవేదన వ్యక్తం చేశారు. భూకబ్జాలో బాలినేని హస్తం ఉండటం వల్లే దోషులను అరెస్ట్ చేయలేదన్న ప్రచారం జరుగుతోందని… తన రాజకీయ జీవితంలో ఎప్పుడూ ఇంతటి మానసిక క్షోభ అనుభవించలేదన్నారు. నియోజకవర్గంలో తనను కబ్జా కోరుగా ముద్ర వేస్తుండటం పట్ల ఆవేదన వ్యక్తం చేశారు. దోషులపై చర్యలు తీసుకోవడానికి అధికారులు ఎందుకు వెనుకంజ వేస్తున్నారని బాలినేని ప్రశ్నించారు. కబ్జాకోరుల పై చట్టపరమైన చర్యలు తీసుకోవాలంటే కలెక్టర్, ఎస్‌పీ ఎందుకు ముందుకు రావడం లేదో తెలుసుకోవాలని ధనుంజయ్ రెడ్డిని కోరారు.

భద్రత లేకుండా విజయవాడకు వచ్చిన బాలినేని శ్రీనివాస రెడ్డి ముఖ్యమంత్రి క్యాంప్ కార్యాలయానికి ఉదయాన్నే వచ్చారు. బాలినేని ఆవేదనను విన్న తరువాత జిల్లా యంత్రాంగంతో మాట్లాడి దోషుల పై చర్యలు తీసుకుంటామని ధనుంజయ్ రెడ్డి హామీ ఇచ్చినట్టు తెలిసింది.