చంద్రబాబు లేకుండానే తొలి భేటీ… అందుకేనా…!

టీడీపీ సర్వ సభ్య సమావేశానికి అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. తొలిసారిగా చంద్రబాబు లేకుండా జరుగుతున్న జనరల్ బాడీ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకోనున్నట్లు తెలుస్తోంది. బాబు షూరిటీ…. భవిష్యత్తుకు గ్యారెంటీ కార్యక్రమాన్ని లోకేష్ కొనసాగించడం, నిజం గెలవాలి అనే నినాదంతో మృతుల కుటుంబాలను పరామర్శించేందుకు చంద్రబాబు సతీమణి భువనేశ్వరి పర్యటనల పై చర్చించనున్నారు.

మాజీ మంత్రి లోకేష్ నేతృత్వంలో పార్టీ సర్వసభ్య సమావేశం శనివారం జరగనుంది. మంగళగిరిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో జరగనున్న ఈ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకోనున్నారు. తొలిసారిగా చంద్రబాబు లేకుండా జరుగుతున్న జనరల్ బాడీ సమావేశం అవుతోంది. స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో అరెస్ట్ అయిన చంద్రబాబు… రాజమండ్రి సెంట్రల్ జైలులో జుడిషియల్ రిమాండ్‌లో ఉండటంతో పార్టీ కార్యక్రమాలను కొనసాగించేందుకు సర్వసభ్య సమావేశాన్ని ఏర్పాటు చేశారు. బాబు షూరిటీ, భవిష్యత్తుకు గ్యారెంటీ కార్యక్రమం మధ్యలో ఉన్నప్పుడే చంద్రబాబును నంద్యాలలో పోలీసులు అరెస్ట్ చేశారు. దీంతో ఈ కార్యక్రమాన్ని కొనసాగించాలని లోకేష్ నిర్ణయించారు. ఎక్కడైతే చంద్రబాబు ఈ కార్యక్రమాన్ని నిలిపివేశారో… అక్కడి నుంచే కొనసాగించాలనే నిర్ణయించారు. చంద్రబాబు అరెస్ట్ తరువాత పార్టీ కార్యక్రమాలు జరగడం లేదనే భావన రానివ్వకూడదని నిర్ణయించారు. ఇప్పటికే పార్టీ యాక్షన్ కమిటీ సమావేశాలతో పాటు, జనసేన సమన్వయానికి పార్టీ తరఫున సమన్వయ కమిటీని కూడా నియమించారు. భవిష్యత్తుకు గ్యారెంటీ కార్యక్రమాన్ని కొనసాగించడంతో పాటు, ఇటీవల చంద్రబాబు అరెస్ట్‌తో మరణించిన వారి కుటుంబాలను కూడా పరామర్శించాలని నిర్ణయించారు. ఇందుకోసం చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరి జిల్లాల పర్యటనలను ప్రారంభించనున్నారు. నిజం గెలవాలి అనే కార్యక్రమంలో భువనేశ్వరి పాల్గొంటారు. ఇదే సమయంలో మృతుల కుటుంబాలను కూడా భువనేశ్వరి పరామర్శించనున్నారు.

మరోవైపు పార్టీ అధినేత చంద్రబాబు అరెస్ట్ పై డోర్ టు డోర్ క్యాంపెయిన్, బాబు షూరిటీ… భవిష్యత్తుకు గ్యారెంటీ పథకాన్ని కూడా వివరిస్తూ కరపత్రాలు పంపిణీ కార్యక్రమం ప్రస్తుతం జరుగుతోంది. ఈ కార్యక్రమం పై కూడా సమీక్షించనున్నారు. ఏపీ స్కిల్ డెవలప్‌మెంట్, ఏపీ ఫైబర్ నెట్, ఇన్నర్ రింగ్ రోడ్డు కేసుల్లో వాస్తవాలను వివరించడంతో పాటు, జగన్ దోపిడీని ఎదుటి వారిపై ఆపాదిస్తున్నారని టీడీపీ నేతలు విమర్శిస్తున్నారు. ఏపీ హేట్స్ జగన్ అనే కార్యక్రమాన్ని కూడా పార్టీ ప్రారంభిస్తోందని కూడా ఈ సమావేశంలో వివరించనున్నారు. రాష్ట్రంలో ఓటర్ల జాబితాలో అవకతవకలు, 27 లక్షల ఓట్లు తొలగింపు, బూత్‌ల మార్పుకు కుట్రలపై కూడా ఈ సమావేశంలో చర్చించనున్నారు. ఇంకా అనేక అంశాల పై చర్చించి కార్యక్రమాలను ఇక వేగవంతం చేసేందుకు కార్యాచరణ ప్రణాళికను రూపొందించనున్నారు.

మరోవైపు లోకేష్‌ యువగళం పాదయాత్రను తాత్కాలికంగా వాయిదా వేశారు. చంద్రబాబు అరెస్ట్‌తో నిలిచిపోయిన భవిష్యత్తుకు గ్యారెంటీ యాత్రను కొనసాగించడం, పార్టీ సమన్వయం కోసం పనిచేయాల్సి ఉండటంతో లోకేష్‌ పర్యటించాల్సి ఉంటుందని పార్టీ భావించింది. అందువల్ల పాదయాత్రను ప్రారంభించి మధ్యలో ఆపివేయడం మంచిది కాదని నేతలు సూచించారు. దీంతో చంద్రబాబు జైలు నుంచి విడుదల అయిన వెంటనే లోకేష్ పాదయాత్రను తిరిగి ప్రారంభించాలని నిర్ణయించారు.