టీడీపీ క్యాడర్‌కు ఏమైంది… మరీ ఇలానా…!

40 ఏళ్ల పార్టీ… దేశ రాజకీయాలనే చక్రం తిప్పిన అధినేతలు… దేశవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్న నేతలు… తెలుగు రాష్ట్రాల్లో అత్యధిక కాలం ముఖ్యమంత్రిగా, ప్రతిపక్ష నేతగా వ్యవహరించిన అధినేత… పైగా ఎన్నికల సమయం… ఇలా ఇన్ని ప్రత్యేకతలున్నప్పటికీ… టీడీపీ నేతల్లో మాత్రం ఇంకా భయం పోయినట్లు కనిపించడం లేదు. మా వాళ్లు ఉత్త వెధవాయిలోయ్… అన్న గిరీశం డైలాగ్ ప్రస్తుతం టీడీపీ నేతలు, కార్యకర్తలకు సరిగ్గా సరిపోతుందంటున్నారు రాజకీయ విశ్లేషకులు. ఇందుకు ప్రధానంగా చంద్రబాబు అరెస్ట్ వ్యవహారాన్ని ప్రస్తావిస్తున్నారు. వాస్తవానికి ఓ పార్టీలో కీలక నేతను అరెస్ట్ చేస్తేనే… ఆయన అభిమానులంతా పెద్ద ఎత్తున ఆందోళనలు, ధర్నాలు చేస్తారు. అయితే ఇక్కడ ఏకంగా పార్టీ అధినేత అరెస్టు అయినా సరే… తెలుగు తమ్ముళ్లు మాత్రం సైలెంట్‌గా ఉన్నారనే చెప్పాలి. అధినేత అరెస్టుపై సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారు తప్ప… కనీసం గట్టిగా మాట్లాడేందుకు కూడా టీడీపీ నేతలు సాహసం చేయలేని దయనీయ పరిస్థితి.

తమ పార్టీ అధినేతపై అక్రమంగా కేసులు పెట్టారని… దీనిని తీవ్రంగా ఖండిస్తున్నామంటూ తెగ గోల చేశారు టీడీపీ నేతలు, కార్యకర్తలు. కానీ ఇదంతా కేవలం సోషల్ మీడియాలో, పత్రికల్లో ప్రచారం కోసమే అన్నట్లుగా పరిస్థితి మారిపోయింది. సరిగ్గా ఒక్కనేత కూడా దీనిపై బయటకు వచ్చి మాట్లడలేని పరిస్థితి. ఒకరిద్దరు అక్కడక్కడా అరిచినప్పటికీ… అది కూడా కేవలం పబ్లిసిటీ కోసమే అనేది అందరికీ తెలిసిన బహిరంగ రహస్యం. టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ పాదయాత్ర చేపట్టిన నాటి నుంచి తెలుగుదేశం పార్టీ నేతల హడావుడి అంతా ఇంతా కాదనేది వాస్తవం. ప్రతి ఊరిలో రకరకాల గజమాలలు, బాణాసంచా, స్వాగత సత్కారాలు…. వీటికి తోడు… ఎక్కడైనా చిన్న అడ్డంకి వస్తే… అక్కడ ఎదుర దాడులు… ఇలా యువగళం పాదయాత్రకు భారీ పబ్లిసిటీ చేసుకున్నారు. అయితే పార్టీ అధినేత అరెస్ట్ అయిన తర్వాత మాత్రం.. ఆ కేడర్ ఎక్కడికి పోయిందనే ప్రశ్న తలెత్తుతోంది.

చంద్రబాబును అరెస్టు చేసినట్లు శనివారం తెల్లవారుజామున 4 గంటల నుంచే అటు మీడియాలో, సోషల్ మీడియాలో వార్తలు వెల్లువెత్తాయి. ఇక మీడియా ఫోకస్ మొత్తం కేవలం చంద్రబాబు చుట్టే ఉంది. చంద్రబాబును హెలికాఫ్టర్‌లో తరలిస్తారని కొద్దిసేపు… కాదు కర్నూలు నుంచి విమానంలో తరలిస్తారని కొద్దిసేపు పుకార్లు వెల్లువెత్తాయి. కానీ ఇవేవి కాదని ఆయనను రోడ్డు మార్గంలోనే నంద్యాల నుంచి విజయవాడ తీసుకువచ్చారు. అందరికీ తెలిసిన మార్గమే అయినప్పటికీ… ఎక్కడా కూడా ఎలాంటి ఇబ్బందులు లేకుండా పోలీసులు తీసుకురాగలిగారు. కేవలం చిలకలూరిపేటలో ఓ పది నిమిషాల పాటు తప్ప… మరెక్కడా టీడీపీ శ్రేణులు ఆందోళనలు చేయడం… అధినేత అరెస్టును అడ్డుకోవడం చేయలేదు. ఇక ఆదివారం మొత్తం కూడా కేవలం హౌస్ అరెస్ట్ అంటూ సరిపెట్టారు తప్ప… కనీసం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కూడా బయటకు వచ్చిన సందర్భాలు లేవు. చంద్రబాబుకు రిమాండ్ విధించిన తర్వాత… అయ్యో పాపం… అక్రమం… అన్యాయం అంటూ సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారు తప్ప… అధినేతతో పాటు మేము కూడా జైలుకు సిద్ధం అంటూ కనీసం ఒక్కరు కూడా నడవలేని దుస్థితి. సోమవారం బంద్ అని పిలుపునిచ్చారు. కానీ అది పాక్షికంగానే జరిగిందనేది వాస్తవం. కీలక నేతలు పార్టీ కార్యాలయానికి పరిమితం అయ్యారు తప్ప… ఒక్క చోట కూడా బయటకు వచ్చి మాట్లాడలేదంటే టీడీపీ కేడర్ నిస్తేజం ఏ స్థాయిలో ఉందో అర్థం అవుతుంది.