తుమ్మలతో రేవంత్..హస్తం గూటికే..సీటుపైనే చర్చ.!

తెలంగాణ రాజకీయాల్లో సీనియర్ నాయకుడు..నాలుగు దశాబ్దాల నుంచి ఉమ్మడి ఖమ్మం జిల్లా రాజకీయాలని శాసిస్తున్న మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పార్టీ మారడానికి చూస్తున్నారు. అధికార బి‌ఆర్‌ఎస్ పార్టీలో సీటు దక్కకపోవడంతో ఆయన హస్తం గూటికి చేరేందుకు రెడీ అవుతున్నారు. ఇంతకాలం పార్టీ మార్పుపై ప్రచారం జరిగిన అది ఆచరణ కాలేదు.

కానీ ఇప్పుడు ఆచరణ అయ్యే దిశగా వెళుతుంది. తుమ్మలని తాజాగా రేవంత్ రెడ్డితో పాటు పలువురు కాంగ్రెస్ నేతలు కలిశారు. దీంతో తుమ్మల కాంగ్రెస్ లో చేరడానికి రంగం సిద్ధం చేసుకున్నారని తెలుస్తోంది. ఇక కాంగ్రెస్‌లో చేరికపై తన సహచరులు, అభిమానులను సంప్రదించి నిర్ణయం తీసుకుంటా అని తుమ్మల చెప్పారని, ఏఐసీసీతో పాటు, ఖమ్మం జిల్లా ముఖ్య నాయకుల అనుమతితోనే తుమ్మలని కలిశామని రేవంత్ చెప్పుకొచ్చారు. అయితే చర్చలు దాదాపు ఫలవంతంగానే కొనసాగినట్లు కనిపిస్తున్నాయి. తుమ్మల దాదాపు కాంగ్రెస్ లో చేరడం ఖాయమని తెలుస్తోంది. అలాగే ఆయనకు పాలేరు సీటు ఫిక్స్ చేస్తారని తెలుస్తోంది.

అయితే ఎన్నో ఏళ్ళు ఖమ్మం జిల్లా రాజకీయాల్లో ఉన్న తుమ్మల..టి‌డి‌పిలో అనేక ఏళ్ళు పనిచేశారు. 2014 ఎన్నికల్లో ఖమ్మం నుంచి పోటీ చేసి ఓడిపోయి..బి‌ఆర్‌ఎస్ లోకి వెళ్లారు. తర్వాత ఎమ్మెల్సీగా, మంత్రిగా పనిచేశారు. 2016 పాలేరు ఉపఎన్నికలో గెలిచారు. 2018 ఎన్నికల్లో ఓడిపోయారు. ఈయనపై కాంగ్రెస్ నుంచి గెలిచిన ఉపేందర్ రెడ్డి బి‌ఆర్‌ఎస్ లోకి వచ్చారు.

అప్పటినుంచి తుమ్మలకు ప్రాధాన్యత తగ్గింది..కీలక పదవి కూడా దక్కలేదు. తాజాగా కే‌సి‌ఆర్..అభ్యర్ధులని ప్రకటించారు. పాలేరుకు ఉపేందర్ రెడ్డిని ప్రకటించారు. దీంతో తుమ్మలకు హ్యాండ్ ఇచ్చారు. సీటు దక్కని నేపథ్యంలో తుమ్మల..కాంగ్రెస్ వైపు చూస్తున్నారు. ఇక ఇదే పాలేరు సీటుని షర్మిల అడుగుతున్నారు. ఆమె కాంగ్రెస్ లోకి వస్తున్నారు. చూడాలి మరి ఫైనల్ గా పాలేరు సీటు విషయంలో ఏం తేలుస్తారో?