జనసేన చాలు..బీజేపీతో వద్దు..!

మొత్తానికి టీడీపీ-జనసేన పొత్తు అధికారికంగా తేలిపోయింది. ఇంతకాలం పొత్తు ఉంటుందా? ఉండదా? అనే డౌట్ ఉండేది. కానీ ఇప్పుడు ఫిక్స్ అయిపోయింది. తాజాగా స్కిల్ కేసులో రాజమండ్రి సెంటర్ జైలులో రిమాండ్ లో ఉన్న చంద్రబాబుని పవన్ కల్యాణ్, లోకేష్, బాలకృష్ణ వెళ్ళి కలిశారు. అనంతరం జైలు నుంచి బయటకొచ్చాక పవన్ ప్రెస్ తో మాట్లాడుతూ..ఇంతకాలం పొత్తుపై నిర్ణయం తీసుకోలేదని, పలుమార్లు కలిసిన ప్రజా సమస్యలపై మాట్లాడుకున్నాం తప్ప..పొత్తుల గురించి మాట్లాడలేదని చెప్పిన పవన్..ఇకపై వైసీపీ అరాచక పాలనని అంతమొందించడానికి టి‌డి‌పి-జనసేన వచ్చే ఎన్నికల్లో కలిసి పోటీ చేస్తాయని ప్రకటించారు.

ఇకపై టి‌డి‌పి-జనసేన కలిసి పోరాటాలు చేస్తాయని, సీట్ల అంశం ఎన్నికల సమయంలో తేల్చుకుంటామని చెప్పుకొచ్చారు. అటు తమతో బి‌జే‌పి కలుస్తుందని ఆశిస్తున్నానని చెప్పారు. అంటే ప్రస్తుతం జనసేన-బి‌జే‌పితో పొత్తులో ఉంది. కానీ ఇప్పుడు టి‌డి‌పితో పొత్తుకు పవన్ రెడీ అయ్యారు. దీని బట్టి చూస్తే బి‌జే‌పి కలిసొచ్చిన, రాకపోయిన పవన్ మాత్రం టి‌డి‌పితో కలిసే వెళ్ళడం ఖాయం. అందులో ఎలాంటి డౌట్ లేదు. అదే సమయంలో బి‌జే‌పి నుంచి పొత్తుపై స్పందన పెద్దగా లేదు.

టి‌డి‌పి-బి‌జే‌పి-జనసేన కలిసి పోటీ చేయాలని పవన్ అనుకుంటున్నారని, కానీ ఆ విషయం తమ అధిష్టానం చూసుకుంటుందని బి‌జే‌పి నేతలు అంటున్నారు. అయితే బి‌జే‌పితో పొత్తుకు టి‌డి‌పి శ్రేణులు విముఖత చూపుతున్నాయి. టి‌డి‌పి ఈ పొజిషన్ లో ఉండటానికి బి‌జే‌పి కారణమని, బాబు అరెస్ట్ వెనుక బి‌జే‌పి పెద్దలు ఉన్నారని తమ్ముళ్ళు నమ్ముతున్నారు.

పైగా బి‌జే‌పిపై రాష్ట్రంలో వ్యతిరేకత తీవ్రంగా ఉందని, పైగా బి‌జే‌పికి ఒక శాతం ఓట్లు కూడా లేవని అలాంటప్పుడు బి‌జే‌పితో పొత్తు పెట్టుకుంటే టి‌డి‌పికి నష్టమని, ఆటోమేటిక్ గా వైసీపీకి లాభం జరుగుతుందని అంటున్నారు. చూడాలి మరి పొత్తులో బి‌జే‌పి కలుస్తుందో లేదో.