జాతీయ అవార్డు గ్రమీత కీర్తి సురేష్ మరికొద్ది రోజుల్లో `భోళా శంకర్` మూవీతో ప్రేక్షకులను పలకరించబోతున్న సంగతి తెలిసిందే. మెగాస్టార్ చిరంజీవి, మిల్కీ బ్యూటీ తమన్నా ఇందులో జంటగా నటించారు. మెహర్ రమేష్ ఈ మూవీకి దర్శకుడు. తమిళంలో ఘన విజయం సాధించిన `వేదాళం`కు రీమేక్ ఇది. సిస్టర్ సెంటిమెంట్ నేపథ్యంలో రూపుదిద్దుకున్న మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ ఇది.
ఈ చిత్రంలో కీర్తి సురేష్ చిరంజీవికి సోదరి పాత్రలో నటించింది. ఆగస్టు 11న ఈ సినిమా గ్రాండ్ రిలీజ్ కాబోతోంది. అయితే ప్రమోషన్స్ లో భాగంగా మన మహానటి ఓ ఇంటర్వ్యూలో పాల్గొంది. ఈ సందర్భంగా ఆమె సినిమాకు సంబంధించిన అనేక విషయాలను పంచుకుంది. అన్నాచెల్లి అనుబంధాల చుట్టూ అల్లుకున్న కథతో భోళా శంకర్ ను రూపొందించారని.. సినిమాకు బాగా వచ్చిందని.. ఖచ్చితంగా ప్రతి ఒక్కరికీ కనెక్ట్ అవుతుందని కీర్తి సురేష్ వెల్లడించింది.
ఈ సినిమాలో చిరంజీవిగారితో స్క్రీన్ షేర్ చేసుకోవడం తన అదృష్టమని.. భోళా శంకర్ సినిమా షూటింగ్ జరిగినన్ని రోజులు తనకు చిరంజీవిగారి ఇంటి నుంచే భోజనం తెప్పించారని, ఆయన ఇంటి నుంచి వచ్చే ఉలవచారు అంటే పడిచచ్చిపోతానని కీర్తి సురేష్ పేర్కొంది. పున్నమినాగు సినిమాతో మా అమ్మ, చిరు సార్ మంచి మిత్రులు అయ్యారు, ఇప్పుడు ఆయనకు తాను కొత్త ఫ్రెండ్ అని కీర్తి తెలిపింది. కాగా, సర్కారు వారి పాట, దసరా వంటి విజయవంతమైన చిత్రాలను ఖాతాలో వేసుకుని మంచి జోరు మీద ఉన్న కీర్తి సురేష్.. భోళా శంకర్ తో హిట్ కొడుతుందా లేదా అన్నది చూడాలి.