సునీల్ క‌మెడియ‌న్‌గా, హీరోగా, విల‌న్ గానే కాదు ద‌ర్శ‌కుడిగా కూడా ఓ సినిమా చేశాడు.. తెలుసా?

సునీల్ అంటే తెలియ‌ని సినీ ప్రియులు ఉండ‌రు. భీమవరంలో పుట్టి పెరిగిన సునీల్‌.. న‌ట‌న‌పై ఉన్న మ‌క్కువ‌తో డిగ్రీ పూర్తైన వెంట‌నే ఇండ‌స్ట్రీ వైపు అడుగులు వేశారు. డాన్సర్ గా, ఆర్ట్ డైరెక్టర్ గా, విలన్ గా అవకాశాల కోసం చెప్పులు అరిగేలా తిరిగాడు. చివ‌ర‌కు క‌మెడియ‌న్ గా సినీ రంగ ప్ర‌వేశం చేశాడు. త‌న‌దైన కామెడీ టైమింగ్ తో ప్రేక్ష‌కుల‌ను క‌డుపుబ్బా న‌వ్వించాడు. స్టార్ క‌మెడియ‌న్ గా ఓ వెలుగు వెలిగిన సునీల్‌.. ఆ త‌ర్వాత హీరోగా మారి ప‌లు సినిమాలు చేశాడు.

ఇప్పుడు విల‌న్ గా రాణిస్తున్నారు. `పుష్ప` సినిమాలో సునీల్ కు పాన్ ఇండియా స్థాయిలో క్రేజ్ ద‌క్కింది. దీంతో ఈయ‌న ఇప్పుడు తెలుగులోనే కాకుండా ఇత‌ర సౌత్ భాష‌ల్లోనూ విల‌న్ గా న‌టిస్తూ దూసుకుపోతున్నాడు. రేపు విడుదల కాబోతున్న సూప‌ర్ స్టార్ ర‌జ‌నీకాంత్ `జైల‌ర్‌` మూవీలోనూ సునీల్ కీల‌క పాత్ర‌ను పోషించాడు. అయితే సునీల్ క‌మెడియ‌న్‌గా, హీరోగా, విల‌న్ గానే కాదు ద‌ర్శ‌కుడిగా కూడా ఓ సినిమా చేశాడు.

ఇంత‌కీ ఆ సినిమా మరేదో కాదు `జ‌క్క‌న్న‌`. సునీల్ ఇందులో హీరోగా న‌టిస్తే.. మన్నారా చోప్రా హీరోయిన్ గా న‌టించింది. 2016లో విడుద‌లైన ఈ చిత్రం క‌మ‌ర్షియ‌ల్ గా భారీ విజ‌యాన్ని అందుకోలేక‌పోయినా.. మంచి వ‌సూళ్లే రాబ‌ట్టింది. ఈ సినిమాకు వంశీకృష్ణ ఆకెళ్ల ద‌ర్శ‌కుడిగా ప‌ని చేశాడు. అయితే కొత్త ద‌ర్శ‌కుడు కావ‌డం వ‌ల్ల‌.. ఔట్ పుట్ స‌రిగ్గా రాలేద‌ట‌. దాంతో సునీల్ మెగా ఫోన్ ప‌ట్టాడు. ఈ సినిమాలో చాలా వ‌ర‌కు స‌న్నివేశాల‌ను సునీల్ స్వ‌యంగా మ‌ళ్లీ డైరెక్ట్ చేశాడు. అలా జ‌క్క‌న్న మూవీ కోసం సునీల్ తొలిసారి ద‌ర్శ‌క‌త్వ బాధ్య‌త‌ల‌ను తీసుకున్నాడు. కానీ, ఈ విష‌యం చాలా మందికి తెలియ‌దు.