ఆ ఇద్దరు వారసులకు కేసీఆర్ గ్రీన్ సిగ్నల్.!

వచ్చే ఎన్నికల్లో గెలుపు గుర్రాలకే సీట్లు ఇవ్వాలని చెప్పి తెలంగాణ సి‌ఎం కే‌సి‌ఆర్ చూస్తున్నారు. సిట్టింగ్ ఎమ్మెల్యేలు అందరికీ సీట్లు ఇస్తే గెలవడం కష్టమనే విషయం అర్ధమవుతుంది. ఎందుకంటే కొందరు ఎమ్మెల్యేలపై ప్రజా వ్యతిరేకత ఎక్కువగానే ఉంది. మొత్తం 119 సీట్లు ఉంటే అందులో 103 మంది బి‌ఆర్‌ఎస్ సిట్టింగ్ ఎమ్మెల్యేలు. దీంతో 103 మందికి సీట్లు ఇస్తే బి‌ఆర్‌ఎస్‌కు రిస్క్. అందుకే ప్రజా వ్యతిరేకత ఎదురుకునే కొందరు ఎమ్మెల్యేలని పక్కన పెట్టాలని కే‌సి‌ఆర్ చూస్తున్నారు.

ఇదే క్రమంలో మరి కొందరు సీనియర్ ఎమ్మెల్యేలని పక్కన పెట్టిన. వారి వారసులకు ఛాన్స్ ఇవ్వాలని చూస్తున్నారు. అయితే మళ్ళీ అందరి వారసులకు ఛాన్స్ ఇవ్వడానికి రెడీగా లేరు. ఇప్పటికే పలువురు ఎమ్మెల్యేలు తమ వారసులకు సీట్లు ఇప్పించుకోవాలని చూస్తున్నారు. నిజామాబాద్‌ రూరల్‌ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్థన్‌, డోర్నకల్‌ ఎమ్మెల్యే రెడ్యానాయక్‌లు తమ వారసులకు ఛాన్స్ ఇవ్వాలని కే‌సి‌ఆర్‌ని కోరినట్లు తెలిసింది.

అటు ఆదిలాబాద్‌ ఎమ్మెల్యే జోగు రామన్న, పెద్దపల్లి ఎమ్మెల్యే దాసరి మనోహర్‌ రెడ్డి, జుక్కల్‌ ఎమ్మెల్యే హనుమంత్‌ షిండేలు సైతం తమ వారసులకు సీట్లు ఇవ్వాలని కోరినట్లు తెలిసింది. కానీ వీరికి కే‌సి‌ఆర్ గ్రీన్ సిగ్నల్ ఇవ్వలేదని తెలిసింది. అయితే కోరుట్ల ఎమ్మెల్యే విద్యాసాగర్‌రావు కుమారుడు సంజయ్‌కు టికెట్‌ ఇస్తానని కేసీఆర్‌ హామీ ఇచ్చినట్లు తెలిసింది. ఎందుకంటే సంజయ్…మంత్రి కేటీఆర్‌కు స్నేహితుడు. పైగా ఎప్పటినుంచో సంజయ్ ప్రజల్లో తిరుగుతున్నారు. అటు గత ఎన్నికల్లో పరిగి సీనియర్‌ నేత కొప్పుల హరీశ్వర్‌ రెడ్డి కొడుకు మహేశ్‌ రెడ్డికి సీటు ఇచ్చారు. ఈ సారి కూడా ఆయనకు సీటు ఇస్తున్నారు. ఇలా ఇద్దరి వారసులకే సీటు దక్కుతుందని తేలింది.