`జైల‌ర్` వంటి బ్లాక్ బ‌స్ట‌ర్ ను మిస్ చేసుకున్న బాల‌య్య‌.. హాట్ టాపిక్ గా డైరెక్ట‌ర్ కామెంట్స్‌!

సూప‌ర్ స్టార్ ర‌జ‌నీకాంత్ తాజాగా `జైల‌ర్‌` మూవీతో ప్రేక్ష‌కుల‌ను ప‌ల‌క‌రించిన సంగ‌తి తెలిసిందే. నెల్స‌న్ దిలీప్ కుమార్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన ఈ యాక్ష‌న్ ఎంట‌ర్టైన‌ర్ ఆగ‌స్టు 10న విడుద‌లై.. తొలి ఆట నుంచే పాజిటివ్ టాక్ ను సొంతం చేసుకుంది. టాక్ అనుకూలంగా ఉండ‌టంతో ర‌జ‌నీ.. బాక్సాఫీస్ వ‌ద్ద అరాచ‌కం సృష్టిస్తున్నాడు. క‌లెక్ష‌న్ల ప‌రంగా దుమ్ము దులుపుతున్నారు.

కేవ‌లం తెలుగులోనే తొలి రోజు ఈ చిత్రం ఏకంగా రూ. 7 కోట్ల రేంజ్ లో వ‌సూళ్ల‌ను అందుకుంది. అలాగే వ‌ర‌ల్డ్ వైడ్ గా రూ. 40 కోట్ల‌కు పైగా క‌లెక్ష‌న్స్ ను రాబ‌ట్టింది. మొత్తానికి జైల‌ర్ తో సూప‌ర్ స్టార్ స్ట్రోంగ్ కాంబ్యాక్ ఇచ్చాడు. అయితే సినిమా స‌క్సెస్ అయిన నేప‌థ్యంలోనే తాజాగా ఓ ఇంట‌ర్వ్యూలో పాల్గొన్న డైరెక్ట‌ర్ నెల్స‌న్‌.. జైల‌ర్ కు సంబంధించి కొన్ని ఇంట్రెస్టింగ్ విష‌యాల‌ను పంచుకున్నాడు. ఈ క్ర‌మంలోనే జైల‌ర్ ను న‌ట‌సింహం నంద‌మూరి బాల‌కృష్ణ మిస్ చేసుకున్నాడ‌ని కామెంట్స్ చేశాడు.

అస‌లింత‌కీ ఏం జ‌రిగిందంటే.. జైల‌ర్ లో మ‌ల‌యాళ స్టార్ మోహ‌న్ లాల్‌, క‌న్న‌డ స్టార్ శివ‌రాజ్ కుమార్ స్పెష‌ల్ రోల్స్ లో మెరిసిన సంగ‌తి తెలిసిందే. అయితే బాల‌య్యను కూడా ఈ సినిమాలో పవర్‌ఫుల్ క్యామియో(అతిథి పాత్ర) కోసం తీసుకోవాలని తొలిత డైరెక్ట‌ర్ అనుకున్నాడ‌ట‌. కానీ, స్క్రిప్ట్‌కు సరిపోయేలా.. ఆ పాత్రను నెల్స‌న్ డిజైన్ చేయలేకపోయాడు. అందుకే ఆ ఆలోచన విరమించుకున్నట్లు నెల్సన్ తెలిపారు. అయితే భవిష్యత్తులో ఆయనతో మూవీ చేసే అవ‌కాశం వ‌స్తుందేమో చూడాలి అంటూ నెల్స‌న్ పేర్కొన్నారు. ఏదేమైనా రజనీ చిత్రంలో బాలయ్య కూడా ఉండి ఉంటే తెలుగు రాష్ట్రాల్లో రచ్చ వేరె లెవ‌ల్ లో ఉండేది.