రాహుల్‌కు కౌంటర్లు..రేవంత్ తగ్గట్లేదు.!

తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకి కొత్త జోష్ వచ్చిన విషయం తెలిసిందే.ఆ పార్టీలోకి చేరికలు పెద్ద ఎత్తున జరుగుతున్నాయి. ఇటీవలే పొంగులేటి, జూపల్లిలతో పాటు 50 మంది వరకు కీలక నేతలు కాంగ్రెస్ లో చేరారు. అలాగే ఖమ్మంలో భారీ బహిరంగ సభ నిర్వహించారు..రాహుల్ గాంధీ సభలో పాల్గొన్నారు. ఇక బి‌ఆర్‌ఎస్..బి‌జే‌పి బీటీమ్ అంటూ విమర్శలు చేశారు. అలాగే కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలోని పలు హామీలని ప్రకటించింది.

ఇలా అనూహ్యంగా కాంగ్రెస్ రేసులోకి దూసుకొచ్చి దూకుడు మీద ఉంది. ఇదే సమయంలో కాంగ్రెస్ పార్టీకి బి‌ఆర్‌ఎస్ నేతలు కౌంటర్లు ఇచ్చే ప్రయత్నం చేశారు. కే‌టి‌ఆర్, హరీష్ రావు, పువ్వాడ అజయ్, నామా నాగేశ్వరరావు, ప్రశాంత్ రెడ్డి…ఇలా పలువురు బి‌ఆర్‌ఎస్ నేతలు వరుసగా ప్రెస్ మీట్లు పెట్టి రాహుల్ పై విరుచుకుపడ్డారు. ఆ వెంటనే రేవంత్ రెడ్డి సైతం ప్రెస్ మీట్ పెట్టి..బి‌ఆర్‌ఎస్ నేతలకు కౌంటర్లు ఇచ్చారు.  తెలంగాణకు ఏ హోదాలో వచ్చారని ప్రశ్నిస్తారా? రాహుల్‌ను విమర్శిస్తున్న మీకున్న అర్హతేంటి? అని రేవంత్ ప్రశ్నించారు. కేసీఆర్‌లా ఆయనది దోపిడీ కుటుంబం కాదని అన్నారు.

2014 జూన్‌ 2న కేసీఆర్‌ కుటుంబం ఆస్తులు.. 2023 జూలై 2 నాటికి ఉన్న ఆస్తులపైన చర్చకు సిద్ధమా అని సవాల్‌ విసిరారు. జనగర్జన సభకు ప్రజలు రాకుండా ప్రభుత్వం అన్ని రకాల కుయుక్తులు చేసిందని, అయినా సభ భారీ సక్సెస్ అయిందని చెప్పుకొచ్చారు. అసలు నక్క తప్ప వేట కుక్కలన్నీ బయటకొచ్చి మొరుగుతున్నాయని మండిపడ్డారు.

ఇలా బి‌ఆర్‌ఎస్, కాంగ్రెస్ పార్టీ నేతల మధ్య మాటల యుద్ధం నడిచింది..దీంతో ఆ రెండు పార్టీల మధ్య పోరు జరగనుందని తెలుస్తుంది. అటు బి‌జే‌పిలో అంతర్గత పోరు ఎక్కువ జరుగుతుంది.