టీడీపీ అధినేత చంద్రబాబుని ఎక్కువగా తిట్టే నాయకుడు ఎవరంటే ఠక్కున కొడాలి నాని పేరు చెప్పేయొచ్చు. అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి కొడాలి..బాబుని బూతులు తిడుతున్నారు. అధికారంలో ఉండటంతో ఆయనని ఎవరు ఏం అనలేని పరిస్తితి. ఇక ఇలా బాబుని దారుణంగా తిడుతున్న కొడాలి..పదే పదే బాబుకు గాని, లోకేష్‌కు గాని దమ్ముంటే గుడివాడలో తనపై పోటీ చేయాలని సవాల్ విసురుతున్నారు.
తాజాగా గుడివాడలో టిడ్కో ఇళ్ల ప్రారంభోత్సవానికి జగన్ ఇచ్చారు. టిడిపి హయాంలో దాదాపు 80 శాతం పైనే నిర్మాణ పనులు పూర్తి చేసుకున్న ఈ ఇళ్ళు వైసీపీ నాలుగేళ్లలో మిగతా శాతం పూర్తి చేసి..తాజాగా లబ్దిదారులకు ఇచ్చింది. కానీ ఇళ్ళు మొత్తం తామే కట్టామని జగన్ చెప్పుకున్నారు. బాబు గుడివాడలో ఒక్క ఇల్లు కట్టలేదని అన్నారు. అయితే వాస్తవం మాత్రం టిడిపి హయాంలోనే 80 శాతం ఇళ్ళు పూర్తి అయ్యాయి. ఆ విషయం పక్కన పెడితే…ఈ సందర్భంగా సభ జరగగా, ఆ సభలో కొడాలి యథావిధిగా చంద్రబాబుపై విరుచుకుపడ్డారు.
ఇక గుడివాడలో తనపై పోటీ చేసి గెలవాలని బాబుకు సవాల్ చేశారు. ఇలా కొడాలి పదే పదే సవాల్ చేస్తూనే ఉన్నారు. ఎందుకంటే గుడివాడలో తనకు తిరుగులేదనే ధీమాలో నాని ఉన్నారు. వరుసగా నాలుగు సార్లు గెలుస్తూ వచ్చారు. ఈసారి కూడా గెలిచేస్తామని అనుకుంటున్నారు. వాస్తవానికి గుడివాడలో కొడాలికే లీడ్ ఉంది.
అదే సమయంలో ఇంతకాలం అధికారంలో లేక గుడివాడకు ఏం చేయలేదని ప్రజలు కొడాలిని మళ్ళీ మళ్ళీ గెలిపించారు. కానీ ఇప్పుడు అధికారంలో ఉంటూ కూడా గుడివాడకు చేసిందేమి లేదని విమర్శలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఈ సారి గుడివాడ ప్రజలు మార్పు కోరుకునే ఛాన్స్ ఉంది. ఈ సారి కొడాలి గెలుపు ఏమి అంత సులువు కాదు. చూడాలి మరి గుడివాడ కొడాలికి మళ్ళీ దక్కుతుందో లేదో.