రూ. 80 కోట్ల ఏజెంట్‌.. ఆ ఒక్క త‌ప్పే ముంచేసిందంటూ నిర్మాత ట్వీట్‌!

అఖిల్ అక్కినేని న‌టించిన లేటెస్ట్ స్పై యాక్షన్ థ్రిల్లర్ `ఏజెంట్`. ఏకే ఎంట‌ర్‌టైన్‌మెంట్స్, సురేందర్ 2 సినిమా బ్యానర్‌లపై రామబ్రహ్మం సుంకర దాదాపు రూ. 80 కోట్ల బ‌డ్జెట్ తో నిర్మించిన ఈ సినిమాకు సురేందర్ రెడ్డి దర్శకత్వం వహించాడు. ఈ మూవీ ద్వారా సాక్షి వైద్య హీరోయిన్ గా న‌టించింది.

 

ఏప్రిల్ 28వ తేదీన ఈ సినిమా విడుదలైంది. భారీ అంచనాల మధ్య వచ్చిన ఏజెంట్‌.. తొలి ఆట నుంచే నెగెటివ్ టాక్ తెచ్చుకుంది. అక్కినేని అభిమానులు కూడా అసంతృప్తితో పెదవి విరిచారు. రూ. 37 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బ‌రిలోకి దిగిన ఈ చిత్రం ఇంత వ‌ర‌కు క‌నీసం రూ. కోట్లు కూడా రాబ‌ట్ట‌లేక బాక్సాఫీస్ వ‌ద్ద ఆపసోపాలు ప‌డుతోంది. అయితే తాజాగా ఏజెంట్ ఫ్లాప్ అవ్వ‌డానికి కార‌ణం ఏంటో నిర్మాత రామబ్రహ్మం సుంకర ట్వీట్ చేశారు.

పెద్ద టాస్క్ అని తెలిసినా సాధించగలమన్న నమ్మకంతో సినిమా చేస్తే, అది ఫెయిల్ అయిందన్నారు. స్క్రిప్టు పూర్తిగా సిద్ధం కాకముందే ఏజెంట్ సినిమా ప్రారంభించి తప్పు చేశామని.. ఆ త‌ప్పే ముంచేసింద‌ని ఆయ‌న వెల్ల‌డించారు. ఏజెంట్ ఫ్లాప్ విషయంలో పూర్తి బాధ్యత తమదేనని, ఈ ఫెయిల్యూర్‌కి వ‌ల్ల చాలా నేర్చుకున్నామ‌ని తెలిపారు. భవిష్యత్తులో ఇలాంటి తప్పులు జరగకుండా చూస్తామని హామీ ఇచ్చారు. ఇక త‌మ‌పై ఎంతో న‌మ్మ‌కం ఉంచిన‌ ప్రేక్ష‌కుల‌ను ఏజెంట్ ద్వారా అల‌రించ‌లేక‌పోయినంద‌కు క్ష‌మించాలంటూ రామ‌బ్ర‌హ్మం సుంక‌ర ట్వీట్ చేశారు. దీంతో ఈయ‌న ట్వీట్ వైర‌ల్ గా మారింది.