అక్కినేని నాగచైతన్య నటించిన కస్టడీ సినిమా నిన్న తెలుగు, తమిళ భాషల్లో అట్టహాసంగా విడుదలైన సంగతి తెలిసిందే. తమిళ దర్శకుడు వెంకట్ ప్రభు తెరకెక్కించిన ఈ చిత్రంలో కృతి శెట్టి హీరోయిన్ గా నటించింది. భారీ అంచనాల నడుమ విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద బోల్తా పడింది. అయితే ఈ సినిమా పరాజయంతో మెగా అభిమానుల్లో కొత్త టెన్షన్ పట్టుకుంది. అందుకు కారణం లేకపోలేదు.
గత కొన్నేళ్ల నుంచి తెలుగు హీరోలకు తమిళ దర్శకులు ఏమాత్రం కలిసి రావడం లేదు. కోలీవుడ్ డైరెక్టర్లతో సినిమాలు చేసిన టాలీవుడ్ హీరోలకు బాక్సాఫీస్ వద్ద నిరాశే ఎదురవుతోంది. ఈ లిస్టులో మహేష్ బాబు స్పైడర్, విజయ్ దేవరకొండ నోటా, అలాగే రామ్ పోతినేని ది వారియర్ వంటి చిత్రాలు ఉన్నాయి. ఈ సినిమాలను తమిళ దర్శకులే తెరకెక్కించారు. ఇప్పుడు ఈ లిస్టులో కస్టడీ కూడా చేరడంతో.. టాలీవుడ్ హీరోలు కోలీవుడ్ డైరెక్టర్లతో సినిమా చేస్తే ఫ్లాపే అన్న సెంటిమెండ్ బలపడింది.
అయితే ప్రస్తుతం మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కోలీవుడ్ డైరెక్టర్ శంకర్ తో `గేమ్ ఛేంజర్` మూవీ చేస్తున్న సంగతి తెలిసిందే. దిల్ రాజు నిర్మాణంలో హై బడ్జెట్ తో పాన్ ఇండియా స్థాయిలో ఈ మూవీని రూపొందిస్తున్నారు. పొలిటికల్ యాక్షన్ థ్రిల్లర్ గా రూపుదిద్దుకుంటున్న ఈ చిత్రం వచ్చే ఏడాది సంక్రాంతికి విడుదల కాబోతోంది. ఇప్పుడు ఈ మూవీ విషయంలో ఎక్కడ కోలీవుడ్ డైరెక్టర్ల బ్యాడ్ సెంటిమెంట్ రిపీట్ అవుతుందో అని మెగా అభిమానులు వర్రీ అవుతున్నారు. ఒకవేళ ఈ సినిమా కనుక ఫ్లాప్ అయితే తమిళ దర్శకులతో వర్క్ చేసేందుకు టాలీవుడ్ హీరోలు భయపడతారు అనడంలో సందేహం లేదు.