కొడాలికి ‘కాపు’ ఎఫెక్ట్..గుడివాడలో చిక్కులు.!

టీడీపీ అధినేత చంద్రబాబు అంటే ఒంటికాలిపై వెళ్ళే కొడాలి నాని ఇప్పుడు చిక్కుల్లో పడ్డారు. బాబుని యథావిధిగా బూతులు తిట్టే కార్యక్రమంలో కొడాలి మాట తడబాటు ఇబ్బందులు తెచ్చింది. మహానాడు వేదికగా చంద్రబాబు మినీ మేనిఫెస్టో ప్రకటించిన విషయం తెలిసిందే. దీనిపై కొడాలి స్పందిస్తూ..బాబుని తిడుతూ..ఎన్టీఆర్‌కు వెన్నుపోటు పొడిచి..ఇప్పుడు జయంతి ఉత్సవాలు చేస్తున్నారని ఫైర్ అయ్యారు.

కాపు సామాజికవర్గాన్ని ఉద్దేశించి పరుష పదజాలం వాడారు. ఇక ఆయన ఏ ఉద్దేశంతో అన్నారో గాని..ఇప్పుడు ఆ మాటలపై పెద్ద ఎత్తున కాపు వర్గం ఫైర్ అవుతుంది. కొడాలి నానిని టార్గెట్ చేస్తుంది.. కాపు వర్గానికి క్షమాపణ చెప్పాలని, వైసీపీ నుంచి కొడాలిని సస్పెండ్ చేయాలని డిమాండ్ చేస్తున్నారు. కాపులను అసభ్యకరంగా దూషించి అవమానించిన కొడాలి నానిని వైసీపీ నుంచి బహిష్కరించాలని ఐక్య కాపునాడు, కాపు సంక్షేమ యువసేన డిమాండ్‌ చేసింది.

కాపులకు బహిరంగంగా క్షమాపణ చెప్పాలని, లేకపోతే తీవ్ర పరిణామాలను ప్రభుత్వం ఎదుర్కోవాల్సి ఉంటుందని, కొడాలి నాని గుడి వాడలో గెలిచిందే కాపు ఓట్లతోనేనని, రాబోయే ఎన్నికల్లో గుడివాడలో ఓడించి కాపుల ఐక్యతను చాటుతామని జనసేన నేత లంకిశెట్టి బాలాజీ హెచ్చరించారు. మొత్తానికి ఇలా నాని కాపుల అంశంలో ఇరుక్కున్నారు. అయితే ఆయన ఏ ఉద్దేశంతో అన్నారో గాని..కాపు నా…అంటూ కొడాలి మాట్లాడిన మాటలు ఇప్పుడు వైరల్ గా మారాయి.

దీంతో ఆయనపై కాపు వర్గాలు మండిపడుతున్నాయి. అయితే గుడివాడలో కాపు ఓట్లు ఎక్కువగానే ఉన్నాయి. ఇంతకాలం వారు కొడాలికే మద్ధతు ఇచ్చారు. ఇప్పుడు ఏమైనా మార్పు వచ్చి కొడాలికి నష్టం జరుగుతుందేమో చూడాలి.