ముందస్తు ముచ్చట..జగన్ ప్లాన్ వర్కౌట్ అవుతుందా?

ఏపీ రాజకీయాల్లో ఎప్పటినుంచో ముందస్తు ఎన్నికలపై చర్చ నడుస్తున్న విషయం తెలిసిందే. అధికార వైసీపీ ముందస్తుపై ఏం మాట్లాడలేదు గాని…ప్రతిపక్ష టి‌డి‌పి మాత్రం జగన్ ఖచ్చితంగా ముందస్తుకు వెళ్తారని అంచనా వేస్తుంది. ప్రతిపక్ష నేత చంద్రబాబు పదే పదే..జగన్ ముందస్తుకు వెళ్ళే అవకాశాలు ఉన్నాయని చెబుతున్నారు. ప్రభుత్వంపై వ్యతిరేకత వస్తున్న నేపథ్యంలో, ఆ వ్యతిరేకత పూర్తిగా పెరగకముందే జగన్..ముందస్తుకు వెళ్ళి గెలవాలని చూస్తున్నారని అంటున్నారు. ఇదే క్రమంలో ఇటీవల మంత్రులు ఎన్నికల వస్తున్నాయి..త్వరగా పనులు పూర్తి చేయాలని అధికారులకు ఆదేశాలు జారీ చేస్తున్నారు.

అయితే షెడ్యూల్ ప్రకారం చూసుకుంటే వచ్చే ఏడాది ఏప్రిల్ లో ఎన్నికలు జరగాలి..కానీ జగన్ డిసెంబర్ లో ఎన్నికలకు వెళ్ళేలా ప్రణాళికలు రచిస్తున్నారని కథనాలు వస్తున్నాయి. అత్యంత విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం.. రాష్ట్రం ఆర్థిక సంక్షోభంతో కొట్టుమిట్టాడుతోంది. కేంద్ర పెద్దల దయతో అప్పులు తెచ్చినా.. సంక్షేమ పథకాలకు నగదు బదిలీని వచ్చే ఏడాది ఏప్రిల్‌ దాకా కొనసాగించడం కష్టమవుతుందిని, పైగా ప్రభుత్వంపై వ్యతిరేకత కూడా పెరుగుతుందని వైసీపీ వర్గాలు అంచనా వేస్తున్నాయట.

ఇక డిసెంబర్ లోనే తెలంగాణ ఎన్నికలు జరగనున్నాయి. ఆ ఎన్నికలతో పాటే డిసెంబరులో ఎన్నికలకు వెళ్తే ఎలా ఉంటుందని జగన్‌ తీవ్రంగా ఆలోచన చేస్తున్నట్లు తెలిసింది. విపక్షాల ఊహకు అందని విధంగా అక్టోబరులో అసెంబ్లీని రద్దుచేసి నవంబరులో ఎన్నికల షెడ్యూల్‌ ప్రకటించేలా చేసి డిసెంబరులో ఎన్నికలకు వెళ్లే దిశగా ఆయన రెడీ అవుతున్నారని తెలిసింది. ముందస్తుకు వెళ్ళేందుకు ఢిల్లీ పెద్దలతో మంతనాలు జరిపి.. అన్నీ ఖరారు చేసుకున్నాకే ఈ నిర్ణయానికి వచ్చారని సమాచారం.

అసెంబ్లీ ఎన్నికల్లో సహకరిస్తే..పార్లమెంట్ ఎన్నికల్లో బి‌జే‌పికి మద్ధతుగా ఉంటామనే ఒప్పందంతో జగన్ ఉన్నారని తెలిసింది. చూడాలి మరి ఈ కథనం ఎంతవరకు నిజమవుతుంది..ముందస్తుకు ఎంతవరకు వెళ్తారో.

Share post:

Latest