పవన్ వ్యూహాలు..జగన్‌కే ప్లస్ అవుతాయా?

వచ్చే ఎన్నికల్లో జగన్‌ని ఓడించాలని అటు చంద్రబాబు, ఇటు పవన్ ట్రై చేస్తున్న విషయం తెలిసిందే. గత ఎన్నికల్లో ఇద్దరు విడిగా పోటీ చేయడం వల్ల ఓట్లు చీలిపోయి జగన్‌కు మేలు జరిగింది. కానీ ఈ సారి అలా జరగకూడదని, ఇద్దరు కలిసి పోటీ చేయాలని డిసైడ్ అయ్యారు. ఈ క్రమంలోనే బాబు, పవన్ పొత్తు దిశగా వెళుతున్నారు. టి‌డి‌పి, జనసేన కలిసి పోటీ చేయడం ఖాయంగా కనిపిస్తుంది.

అయితే ఇక్కడ పవన్ మరోక అంశం కూడా ప్రస్తావిస్తున్నారు. బి‌జే‌పితో కలిసే ముందుకెళ్తామని అంటున్నారు. అంటే టి‌డి‌పి-జనసేన-బి‌జే‌పి పొత్తు ఉంటుందని చెప్పుకొస్తున్నారు. కాకపోతే బి‌జే‌పి ఏమో ఇంకా పొత్తులపై క్లారిటీ ఇవ్వలేదు. టి‌డి‌పితో కలవమని బి‌జే‌పి నేతలు చెబుతున్నారు. ఇటు టి‌డి‌పి శ్రేణులు సైతం బి‌జే‌పితో పొత్తు అనవసరమని భావిస్తున్నారు. కానీ పవన్ మాత్రం పొత్తుకు బి‌జే‌పిని ఒప్పిస్తానని అంటున్నారు. అంటే టి‌డి‌పి-జనసేన-బి‌జే‌పి కలుస్తాయని చెప్పవచ్చు. అయితే టి‌డి‌పి-జనసేన వరకు కలిస్తే పర్లేదు గాని..బి‌జే‌పితో కలిస్తేనే అసలు ఇబ్బంది వస్తుందని విశ్లేషణలు వస్తున్నాయి.

టి‌డి‌పి-జనసేన కలిసి వైసీపీకి చెక్ పెట్టే అవకాశాలు ఉన్నాయని, కానీ బి‌జేపితో కలిస్తే వైసీపీకే లాభం జరుగుతుందని అంచనా వేస్తున్నారు. ఎందుకంటే ఏపీ ప్రజలు బి‌జే‌పిపై ఆగ్రహంగానే ఉన్నారు. రాష్ట్రానికి న్యాయం చేయని బి‌జే‌పిని ఇక్కడ ప్రజలు ఆదరించే పరిస్తితి లేదు. ఈ నేపథ్యంలో బి‌జే‌పిపై ఉండే వ్యతిరేకత టి‌డి‌పి-జనసేనలపై పడుతుందని, అప్పుడు ఆటోమేటిక్ గా వైసీపీకి మేలు జరుగుతుందని అంచనా వేస్తున్నారు.

అలా కాకుండా టి‌డి‌పి-జనసేనల మధ్యే పొత్తు ఉంటే వైసీపీని నిలువరించడానికి కాస్త అవకాశం ఉందని చెబుతున్నారు. చూడాలి మరి పొత్తులు ఎలా ఉంటాయో.

Share post:

Latest