బాలినేని జంపింగ్ ఉందా? కోవర్టు ఆపరేషన్ నడుస్తుందా?

ఏంటో ఈ మధ్య వైసీపీలో జగన్‌తో అత్యంత సన్నిహితంగా ఉన్నవారే దూరం జరుగుతున్నారు. ఊహించని పరిణామాల నేపథ్యంలో రెడ్డి వర్గం నేతలు..అందులోనూ జగన్‌కు దగ్గరగా ఉన్నవారే దూరం అవుతున్నారు. ఇప్పటికే నెల్లూరులో కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి, ఆనం రామనారాయణ రెడ్డి లాంటి వారు వైసీపీకి దూరమయ్యారు. ఇప్పుడు జగన్ బంధువు మాజీ మంత్రి బాలినేని శ్రీనివాస్ రెడ్డి దూరమయ్యేలా ఉన్నారు.

ఈయనని మంత్రి పదవి తప్పించిన దగ్గర నుంచి అసంతృప్తిగా ఉన్నారు..అలాగే నిదానంగా పార్టీలో ప్రాధాన్యత తగ్గుతూ వస్తుంది. ఈ క్రమంలోనే ఆయన పార్టీ ప్రాంతీయ సమన్వయకర్త పదవికి రాజీనామా చేశారు. ఆఖరికి జగన్ స్వయంగా మాట్లాడి బుజ్జగించిన బాలినేని వెనక్కి తగ్గలేదు. రాజీనామాని వెనక్కి తీసుకోలేదు. తాజాగా మీడియాతో మాట్లాడుతూ..సొంత వాళ్లే తనని దెబ్బతీయాలని చూస్తున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.  పార్టీలోని కొంత మంది అగ్ర నేతలే తనను టార్గెట్‌ చేశారని, వైసీపీని నాశనం చేసేందుకు కొందరు కంకణం కట్టుకున్నారని.. వారి వ్యవహారాలను సీఎం దృష్టికి తీసుకెళ్లానని చెప్పారు.

అలాగే ఎక్కడ ఏది జరిగినా తనపైనే నిందలు వేస్తున్నారని, హవాలా మంత్రి, భూకబ్జాలు, సినిమాల్లో పెట్టుబడులంటూ రకరకాలుగా అవినీతి ఆరోపణలు చేశారని,  జిల్లాలోని కొందరు వైసీపీ ఇన్‌చార్జులు, ఎమ్మెల్యేలతో సీఎంకు తనపై ఫిర్యాదులు చేయిస్తున్నారని.. అవి ఎవరు చేయిస్తున్నారో తెలుసని అన్నారు. ఆఖరికి తాను ఎమ్మెల్యే టికెట్లు ఇప్పించిన వ్యక్తులే తనపై ఫిర్యాదులు చేయడం దారుణమని ఆవేదన వ్యక్తం చేశారు. ఇక చివరి వరకు వైఎస్‌ కుటుంబంతో ఉంటాను తప్ప పార్టీ మారే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు.

కానీ ఈయన పార్టీ మారే అవకాశాలు ఉన్నాయని ప్రచారం జరుగుతుంది. టి‌డి‌పి లేదా జనసేనలోకి వెళ్తారా? అని అంటున్నారు. అదే జరిగితే వైసీపీ ఏదో కోవర్టు ఆపరేషన్ ప్లాన్ చేసిందని అనుకోవచ్చని విశ్లేషకులు అంటున్నారు. జగన్ తో మాట్లాడకే కోటంరెడ్డి బయటకొచ్చారని, ఇప్పుడు బాలినేని వంతు అని, ఇదంతా ఓ కోవర్టు ఆపరేషన్ మాదిరిగా ఉందని అంటున్నారు. చూడాలి మరి బాలినేని ఏం చేస్తారో.

Share post:

Latest