వైసీపీ కోటలపై బాబు ఫోకస్..పట్టు దొరికేనా.!

నెక్స్ట్ ఎన్నికల్లో గెలిచి అధికారం సొంతం చేసుకోవాలని చూస్తున్న చంద్రబాబు..గ్యాప్ లేకుండా ప్రజల్లో  తిరుగుతూ..ప్రజల మద్ధతు పెంచుకునే దిశగా ముందుకెళుతున్న విషయం తెలిసిందే. టి‌డి‌పి బలం పెంచి..వైసీపీకి ధీటుగా నిలబెట్టే ప్రయత్నం చేస్తున్నారు. అటు నారా లోకేశ్ సైతం పాదయాత్రతో పార్టీకి ఊపు తెస్తున్న విషయం తెలిసిందే. ఇక బాబు ఇదేం ఖర్మ మన రాష్ట్రానికి ప్రోగ్రాంతో రాష్ట్రమంతా తిరుగుతున్నారు. వారానికి మూడు నియోజకవర్గాల్లో రోడ్ షోలు, బహిరంగ సభలు పెట్టుకుంటున్నారు.

గత నెలలో కృష్ణా, ప్రకాశం, గుంటూరు జిల్లాల్లో బాబు పర్యటించిన విషయం తెలిసిందే. ఈ నెలలో నెల్లూరు, ఉత్తరాంధ్ర జిల్లాల్లో పర్యటించనున్నారు. అయితే మొదట నెల్లూరులోని మూడు నియోజకవర్గాల్లో రోడ్ షోలు, సభల్లో పాల్గొనున్నారు. వాస్తవానికి 2వ తేదీ నుంచి బాబు పర్యటనలు మొదలు కావాలి. కానీ వర్షాల వల్ల ప్రోగ్రాం 4వ తేదీకి వాయిదా పడింది. 4వ తేదీన సూళ్ళూరుపేటలో బాబు పర్యటిస్తారు. ఇక 5వ తేదీన గూడూరు, 6న వెంకటగిరి నియోజకవర్గంలో బాబు పర్యటన ఉంది.

అయితే ఈ మూడు నియోజకవర్గాలు వైసీపీకి కంచుకోటలుగానే ఉన్నాయి. ఇప్పుడు బాబు పర్యటించి ఆయా స్థానాల్లో పార్టీ బలాన్ని పెంచాలని చూస్తున్నారు. ఇప్పటికే గూడూరులో వైసీపీ ఎమ్మెల్యేపై తీవ్ర వ్యతిరేకత ఉంది. కానీ అక్కడ టి‌డి‌పి ఇంకా బలపడాలి. చంద్రబాబు ఎంట్రీతో కాస్త పట్టు పెరిగే ఛాన్స్ ఉంది. వెంకటగిరిలో వైసీపీ ఎమ్మెల్యే ఆనం రామనారాయణ రెడ్డి ఉన్నారు..ఆయన వైసీపీకి దూరమైన విషయం తెలిసిందే. అక్కడ టి‌డి‌పి బలపడుతుంది.

ఇటు సూళ్ళూరుపేటలోనే వైసీపీ కాస్త బలంగా ఉంది. అక్కడ బాబు పర్యటించి టి‌డి‌పి బలం పెంచాల్సి ఉంది. మరి బాబు పర్యటన తర్వాత వైసీపీ కంచుకోటల్లో మార్పు వస్తుందేమో చూడాలి.