ఖుషి సినిమాకి ఆ పేరు పెట్టడానికి కారణం ఇదే: డైరెక్టర్ శివ!

అగ్రతార సమంత రూత్ ప్రభు ఇప్పుడు తన అప్‌కమింగ్ మూవీ శాకుంతలం రిలీజ్‌కై వేచి చూస్తోంది. ప్రస్తుతానికి ఈ తార శాకుంతలం మూవీ ప్రమోషన్లలో బిజీగా ఉంది. డైరెక్టర్ గుణశేఖర్ శకుంతల, దుష్యంతుల ప్రేమకథ ఆధారంగా ఈ మూవీని రూపొందించాడు. ఇది ఏప్రిల్ 14న థియేటర్లలో రిలీజ్ కావడానికి సిద్ధమవుతోంది. ఈ నేపథ్యంలో సామ్‌ శకుంతల యువరాణి పాత్రలో ఎలా కనిపిస్తుందో చూడాలని, ఆమె నటన ఎంత బాగుందో వీక్షించి ఎంజాయ్ చేయాలని అభిమానులు ఎంతో ఆసక్తితో ఎదురుచూస్తున్నారు.

ఇదిలా ఉండగా సమంత చేతిలో మరో మూవీ ఉంది. అదే విజయ్ దేవరకొండతో కలిసి నటిస్తున్న చిత్రం ఖుషి. డైరక్టర్ శివ నిర్వాణ తీస్తున్న ఈ మూవీ షూటింగ్ పనులు కొద్ది రోజుల నుంచి వేగవంతం అయ్యాయి. అసిస్టెంట్ డైరెక్టర్ నుంచి నిన్ను కోరితో స్టార్ డైరెక్టర్‌గా ఎదిగిన శివ నుంచి ఇంకా ఏ సినిమా రిలీజ్ కాలేదు. ఇప్పుడు అతని నుంచి వస్తున్న ఖుషిపై ప్రేక్షకుల్లో భారీగా అంచనాలు ఉన్నాయి. ఈ క్రమంలోనే శివ నిర్వాణ ఒక ఇంటర్వ్యూలో పాల్గొని ఖుషి మూవీ గురించి పలు ఆసక్తికర విషయాలు వెల్లడించాడు. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ హిట్ మూవీ అయిన ఖుషి సినిమా పేరును దీనికి ఎందుకు పెట్టాల్సి వచ్చిందో తెలిపాడు.

ఖుషి షూటింగ్ కూడా 90% కంప్లీట్ అయిందని చెప్పి అందరిలో ఆసక్తిని పెంచేశాడు. సమంత మయోసైటిస్ సమస్య నుంచి రికవరీ కావడానికి నాలుగు నెలలు బ్రేక్ తీసుకున్నామని.. రీసెంట్‌గా కశ్మీర్‌లో 30 రోజుల షెడ్యూల్‏ను ఫినిష్ చేశామని చెప్పుకొచ్చారు. మజిలీ సమయంలో సమంత, తాను కలిసి పనిచేశామని.. తర్వాత ఖుషి కథ రాస్తున్నప్పుడు ఫిమేల్ లీడ్ రోల్‌కి సమంత తప్ప మరెవ్వరూ సూట్ కారని తనకు అనిపించిందని తెలిపాడు. విజయ్ కూడా హీరో పాత్రకు 100% న్యాయం చేశాడని పేర్కొన్నాడు. ఖుషిలో సమంత, విజయ్ మధ్య కెమిస్ట్రీ అద్భుతంగా ఉంటుందని చెప్పుకొచ్చాడు. పవన్ కళ్యాణ్ ఖుషి సినిమాలాగా ఇదొక ఫీల్ గుడ్ మూవీలా ఉంటుందని.. కామెడీ, ఎమోషన్స్ అన్నీ ఖుషి సినిమాని తలపిస్తాయని, అందుకే దీనికి ఆ పేరు పెట్టినట్లు శివ నిర్మాణ పేర్కొన్నాడు.