మాస్ మహారాజా రవితేజు మెగా హీరోలు బాగా వాడేసుకుంటున్నారు. ఇటీవల మెగాస్టార్ చిరంజీవి నటించిన `వాల్తేరు వీరయ్య`లో రవితేజను ఓ కీలక పాత్ర కోసం తీసుకున్నారు. బాబీ దర్శకత్వం వహించిన ఈ చిత్రం సంక్రాంతి కానుకగా విడుదలై ఎంతటి సంచలన విజయాన్ని నమోదు చేసిందో తెలిసిందే.
ఈ సినిమా విజయంలో రవితేజ కీలక పాత్రను పోషించాడు అనడంలో సందేహమే లేదు. ఎన్నో ఏళ్ల నుంచి సరైన హిట్ లేక సతమతం అవుతున్న చిరు ఈ మూవీతో కంబ్యాక్ ఇచ్చారు. ఇదిలా ఉంటే.. ఇప్పుడు పవన్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమాలో రవితేజ నటించబోతున్నాడని తాజాగా ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ తెరపైకి వచ్చింది.
గబ్బర్ సింగ్ తర్వాత ప్రముఖ దర్శకుడు హరీష్ శంకర్, పవన్ కళ్యాణ్ కాంబోలో తెరకెక్కుతున్న చిత్రం `ఉస్తాద్ భగత్ సింగ్`. తాజాగా ఈ మూవీ సెట్స్ మీదకు వెళ్లింది. రెగ్యులర్ షూటింగ్ హైదరాబాద్ లోని అల్యూమినియం ఫ్యాక్టరీ లో జరుగుతోంది. అయితే ఈ చిత్రంలో రవితేజ ఓ కీలక పాత్రలో కనిపించబోతున్నారట. ఇప్పటికే ఆయనకు స్టోరీ చెప్పి మెప్పించాడట దర్శకుడు. రవితేజ పాత్ర వివరాలు తెలియకపోయినా.. సినిమాలో ఆయన రోల్ ఎంతో కీలకంగా ఉంటుందని ప్రచారం జరుగుతోంది. అంతేకాదు, త్వరలోనే రవితేజ షూటింగ్ లో జాయిన్ కానున్నాడట. మరి ఇది ఎంత వరకు నిజం అన్నది చూడాలి.