ఐశ్వర్య రజనీకాంత్ ఇంట్లో భారీ చోరీ.. వారిపైనే అనుమానం!

సూప‌ర్ స్టార్ ర‌జ‌నీకాంత్ కుమార్తె, ధ‌నుస్ మాజీ స‌తీమ‌ణి ఐశ్వర్య రజనీకాంత్ ఇంట్లో భారీ చోరీ జ‌రిగింది. ఆమె ఇంట్లో ల‌క్ష‌లు విలువ చేసే నగలు చోరీకి గురయ్యాయి. దాంతో ఐశ్వ‌ర్య పోలీసుల‌ను ఆశ్ర‌యించింది. చెన్నైలోని త‌న నివాసం నుంచి 480 గ్రాముల బంగారం, వజ్రాభరణాల జ్యుయలరీ చోరీకి గురైనట్టు తెయాన్ మెట్ పోలీసులకు ఐశ్వ‌ర్య ఫిర్యాదు చేశారు.

లాకర్ లో ఉంచినవి కనిపించడం లేదని ఆమె పేర్కొన్నారు. 2019లో తన చెల్లి సౌందర్య పెళ్లి సమయంలో ఆ నగలను వాడాప‌పి, ఆ తర్వాత వాటిని లాకర్‌లో ఉంచాన‌ని.. మ‌ళ్లీ వాటిని బ‌య‌ట‌కు తీయ‌లేద‌ని ఐశ్వర్య తన ఫిర్యాదులో పేర్కొంది. అయితే ఫిబ్రవరి 10న లాకర్‌ని చెక్‌ చేయగా.. తనకు వివాహమైన తర్వాత నుంచి గత 18 ఏళ్లలో సమకూర్చుకున్న ఆభరణాల్లో కొన్ని లేవని గుర్తించాను.

డైమండ్ సెట్స్, పురాతన బంగారం పీసులు, నవరత్న సెట్స్, గాజులు పోయిన వాటిల్లో ఉన్నాయి. లాకర్‌ కీలు సెయింట్‌ మేరీస్‌ రోడ్ అపార్ట్‌మెంట్‌లోని త‌న‌ వ్యక్తిగత స్టీల్‌ అల్మారాలో ఉంచాన‌ని, ఇది త‌న సిబ్బందికి తెలుస‌ని ఐశ్వ‌ర్య తెలిపింది. అలాగే తన దగ్గర పనిచేసే ఈశ్వరి, లక్ష్మీ, డ్రైవర్ వెంకట్ పై అనుమానం వ్యక్తం చేశారు. దీంతో సెక్షన్ 381 కింద పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు మొదలు పెట్టారు.