డైలాగ్ కింగ్ మోహన్ బాబు తనయులు, మంచు బ్రదర్స్ మనోజ్-విష్ణు మధ్య విభేదాలు ఏర్పడ్డాయని ఎప్పటి నుంచి ప్రచారం జరుగుతున్న సంగతి తెలిసిందే. అయితే నేడు ఈ విభేదాలు బయటపడ్డాయి. మంచు బ్రదర్స్ కు సంబంధించిన ఓ వీడియో ఈ రోజు ఉదయం నుంచి ఇటు సోషల్ మీడియాను, అటు ప్రధాన మీడియాను ఓ ఊపు ఊపేస్తోంది.
వీడియో విషయానికి వస్తే.. మంచు మనోజ్ అనుచరుడైన సారధిపై విష్ణు దాడి చేసినట్టు తెలుస్తోంది. `ఇండ్లలోకి వచ్చి మా వాళ్లను, బంధువులను ఇలా కొడుతుంటారండి. ఇదీ ఇక్కడి పరిస్థితి` అంటూ మనోజ్ వీడియోలో చెప్పుకొచ్చాడు. ఈ వీడియోను మనోజ్ స్వయంగా సోషల్ మీడియా వేదికగా షేర్ చేశారు. మళ్లీ కొద్ది సేపటికే దాన్ని తొలగించాడు. దాంతో ఈ విషయం చర్చకు దారి తీస్తోంది.
అసలు వీరిద్దరి మధ్య గొడవకు కారణం ఏంటంటూ ఆరాలు తీయడం మొదలు పెట్టారు. అయితే మనోజ్ తో వివాదంపై విష్ణు స్పందించాడు. `ఇది చాలా చిన్న విషయం. దీనిని ఇంత పెద్దగా చేయాల్సిన అవసరం లేదు. మా ఇద్దరి మధ్య ఇది సాధారణమైన గొడవ. ఇది నిన్న ఉదయం జరిగిన సంఘటన. సారథి వాగ్వాదాన్ని మంచు మనోజ్ అడ్డుకోలేదు. మనోజ్ చిన్న వాడు. ఏదో ఆవేశంలో వీడియో పోస్ట్ చేశాడు. జరిగింది అదే` అంటూ మంచు విష్ణు చెప్పుకొచ్చాడు. దీంతో ఈయన కామెంట్స్ కాస్త నెట్టింట వైరల్ గా మారాయి. మొత్తానికి మంచు బ్రదర్స్ మధ్య గొడవకు కారణం సారథి అని ప్రచారం జరుగుతోంది. కాగా, సారథి మోహన్ బాబు కుటుంబానికి అత్యంత సన్నిహితుడు, బంధువు అని తెలుస్తోంది.