నెల్లూరు వైసీపీలో కలకలం..కోటంరెడ్డి కూడా అవుట్?

కంచుకోటగా ఉన్న నెల్లూరు జిల్లాలో వైసీపీకి షాకులు మీద షాకులు తగులుతున్నాయి. సొంత పార్టీ ఎమ్మెల్యేలే సొంత ప్రభుత్వంపై విరుచుకుపడే పరిస్తితి. సరిగ్గా నిధులు అందకపోవడం, అధికారులు అభివృద్ధి పనులకు సహకరించకపోవడంపై వెంకటగిరి ఎమ్మెల్యే ఆనం రామ్ నారాయణ రెడ్డి, నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డిలు..సొంత ప్రభుత్వానికి వ్యతిరేకంగా గళం విప్పిన విషయం తెలిసిందే.

ఈ క్రమంలోనే మరి ఎక్కువగా ఫైర్ అయిన ఆనంకు వైసీపీ అధిష్టానం చెక్ పెట్టింది..ఆయన ప్రాతినిధ్యం వహిస్తున్న వెంకటగిరి బాధ్యతలని నేదురుమల్లి రామ్ కుమార్ రెడ్డికి అప్పగించారు. దీంతో ఆనంని సైడ్ చేసినట్లు అయింది. అయితే కోటంరెడ్డిని జగన్ పిలిపించి మాట్లాడారు. దీంతో సమస్య తగ్గిందనుకుంటే..తాజాగా కోటంరెడ్డి ఓ బాంబు పేల్చారు. వైసీపీ అధిష్టానం కొత్త డ్రామాకు తెరలేపిందని కార్యకర్తలతో వ్యాఖ్యానించిన కోటంరెడ్డి .. తన ఫోన్ ట్యాపింగ్ చేస్తున్నారని.. దీంతో తన మనోభావాలు దెబ్బతిన్నాయని కార్యకర్తలతో చెప్పుకొచ్చారు. అనుమానం ఉన్న చోట కొనసాగడం కష్టమని అన్నారు.

దీనికంటే ముందు తనపై ఇంటెలిజెన్స్‌ అధికారులు నిఘా పెట్టారని, మూడు నెలల నుంచి తన ఫోన్‌ ట్యాప్‌ చేస్తున్నారని , ఈ విషయం తనకు ముందే తెలుసని, రహస్యాలు మాట్లాడుకునేందుకు మరో ఫోన్‌ ఉందని, 12 సిమ్‌లు కూడా ఉన్నాయని తెలిపారు. ఫేస్‌ టైమర్‌, టెలిగ్రాం కాల్స్‌ను మీ పెగాసస్‌ రికార్డు చేయలేదని, నిఘా కోసం తన నియోజకవర్గంలో ఒక ఐపీఎస్‌ అధికారిని ఏర్పాటు చేసుకోండని ఫైర్ అయ్యారు.

ఇదిలా ఉంటే నెల్లూరు రూరల్ బాధ్యతలని ఆనం విజయ్ కుమార్ రెడ్డికి ఇస్తారని మొదట ప్రచారం జరిగింది. కానీ తాజాగా కోటంరెడ్డి సోదరుడు గిరిధర్ రెడ్డికి నెల్లూరు రూరల్ సీటు ఇస్తున్నారని తెలిసింది. ఆ విషయాన్ని స్వయంగా కోటంరెడ్డి చెప్పుకొచ్చారు. వచ్చే ఎన్నికల్లో గిరిధర్ రెడ్డి వైసీపీ తరపున పోటీ చేస్తే తాను పోటీ చేయబోనని,  తమ్ముడికి పోటీగా తాను నిలబడనని, తాను రాజకీయాలకు గుడ్ బై చెబుతానని అన్నారు. మొత్తానికి కోటంరెడ్డి వైసీపీకి దూరమైనట్లే కనిపిస్తుంది.