చిత్తూరు జిల్లాలో టీడీపీ అధినేత చంద్రబాబు, మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిల మధ్య రాజకీయ వైరం కొనసాగుతుంది. నాలుగు దశాబ్దాల నుంచి వీరి మధ్య రాజకీయ వైరం కొనసాగుతూ వస్తుంది. ఒకసారి బాబు పైచేయి సాధిస్తే..మరోసారి పెద్దిరెడ్డి పైచేయి సాధిస్తూ వస్తున్నారు. అయితే గత ఎన్నికల్లో చిత్తూరులో 14కు 13 సీట్లు వైసీపీ గెలవడంలో పెద్దిరెడ్డి కీలక పాత్ర పోషించారు. ఇక అధికారంలోకి వచ్చాక కుప్పంని కూడా కైవసం చేసుకోవాలని పెద్దిరెడ్డి ఎలాంటి రాజకీయం చేస్తున్నారో తెలిసిందే.
కుప్పంలో బాబుని ఓడించి తీరాలనే కసితో పెద్దిరెడ్డి పనిచేస్తున్నారు. ఇదే క్రమంలో స్థానిక ఎన్నికల్లో వైసీపీ క్లీన్ స్వీప్ చేసేలా చేశారు. దీంతో కుప్పం అసెంబ్లీని సైతం కైవసం చేసుకుంటామని అంటున్నారు. ఇక బాబు కూడా కుప్పంని వదలకుండా..అక్కడ ఇంకా బలపడేలా ప్రయత్నాలు చేస్తున్నారు. అటు పెద్దిరెడ్డి ప్రాతినిధ్యం వహించే పుంగనూరుని టార్గెట్ చేసి..అక్కడ పెద్దిరెడ్డికి చెక్ పెట్టాలని చూస్తున్నారు. తాజాగా కుప్పంకు వచ్చిన బాబుకు..రోడ్ షోలు, సభలకు పోలీసులు పర్మిషన్ ఇవ్వని సంగతి తెలిసిందే. దీంతో పాదయాత్రతో నియోజకవర్గంలో తిరుగుతున్నారు. పెద్దిరెడ్డి డైరక్షన్‌లో పోలీసులు పనిచేస్తూ..తనని అడ్డుకుంటున్నారని, పుంగనూరు పుడింగి కథ ఏంటో తేలుస్తా? అంటూ బాబు విరుచుకుపడ్డారు. అలాగే పెద్దిరెడ్డి పుంగనూరులో ఎలా గెలుస్తారో చూస్తానని, పుంగనూరులో పెద్దిరెడ్డి గెలిచిన, కుప్పంలో తనని ఓడించిన రాజకీయ సన్యాసం తీసుకుంటానని బాబు సవాల్ చేశారు.
ఇక దీనిపై పెద్దిరెడ్డి స్పందిస్తూ..కుప్పంలో బాబుని ఓడించి తీరతామని అంటున్నారు. మొత్తానికి ఇద్దరు నేతల మధ్య సవాళ్ళ పర్వం నడిచింది. అయితే ఈ సవాల్‌లో ఎవరు గెలుస్తారో ఎన్నికల్లో తెలుస్తోంది. కానీ ఇప్పుడున్న పరిస్తితుల్లో కుప్పంలో బాబుని ఓడించడం కష్టమే..అటు పుంగనూరులో పెద్దిరెడ్డిని ఓడించడం కష్టమే.