టాలీవుడ్‌ ఆ విషయంలో ఫెయిల్ అయింది… 50 రోజుల కండిషన్ ఇక లేనట్లేనా!

కరోనా విపత్తు తరువాత టాలీవుడ్ పరిశ్రమ షేప్ పూర్తిగా మారిపోయిందని చెప్పుకోవాలి. లాక్డౌన్ సమయంలో ప్రజలు ఇళ్లకు పరిమితం అయినపుడు OTTలకు బాగా అలవాటు పడ్డారు. ఇక అదే అలవాటు లాక్డౌన్ తరువాత కూడా కొనసాగుతోంది. దాంతో నిర్మాతల మండలి ఆ మధ్య థియేటర్లను కాపాడుకోవడం కోసం అలాగే డిస్ట్రిబ్యూషన్ వ్యవస్థను కాపాడుకోవడం కోసం సినిమాలు థియేటర్‌లో విడుదలైన 50 రోజుల తర్వాత మాత్రమే OTTలో స్ట్రీమింగ్ చేయాలి అనే నిర్ణయానికి వచ్చిన విషయం మనందరికీ తెలిసిందే.

అయితే, ఈ విషయంలో తెలుగు ప్రొడ్యూసర్ గిల్డ్ పూర్తిగా విఫలమైందనే వార్తలు సోషల్ మీడియాలో వెల్లువెత్తుతున్నాయి. ఎందుకంటే ఆ నిర్ణయం తీసుకొని నాలుగైదు నెలలు కావస్తున్నా పాటించడంలో సో కాల్డ్ నిర్మాతలు ఫెయిల్ అయ్యారు. అంటే OTTలను కంట్రోల్ చేయడంలో పూర్తిగా విఫలమయ్యారనే విమర్శలు వస్తున్నాయి. అయితే 50 రోజుల తర్వాత మాత్రమే విడుదల చేయాలి అనే నిబంధన ఉన్నప్పటికీ చాలా మంది నిర్మాతలు దాన్ని పట్టించుకోకపోవడంతో మరోసారి నిర్మాతల మండలి మీటింగ్ ఏర్పాటు చేసి కఠిన నిర్ణయాలు తీసుకోవాల్సిందేనని కొందరు ఇండస్ట్రీకి చెందిన పెద్దవాళ్ళు గుసగుసలాడుకుంటున్నారు.

ఇక ఈ పరిణామం వలన సగటు సినిమా ప్రేక్షకుడు ఏం ఆలోచిస్తున్నాడు అంటే, థియేటర్లలో చూడని సినిమా మూడు నాలుగు వారాల్లో ఏదైనా OTTలోకి వచ్చేస్తుంది కనుక అప్పుడే చూసేద్దాం… ఖర్చులు మిగులుతాయి అని ఎదురు చూస్తున్నారు. అయితే ఈ ఛేంజ్ ఏ మాత్రం ఇండస్ట్రీకి మంచిది కాదని కొంతమంది విశ్లేషకులు చెబుతున్నారు. ఇటువంటి తరుణంలో మరోసారి మన నిర్మాతలు మూకుమ్మడిగా ఒక్కటై 50 రోజుల నియమాన్ని అమలు చేయకపోతే తెలుగు పరిశ్రమకి గడ్డుకాలం తప్పదని కూడా అంటున్నారు.