తెలంగాణలో 30 సీట్లపై టీడీపీ ఆశలు..ఛాన్స్ ఉందా?

ఒకప్పుడు తెలంగాణ అంటే టీడీపీకి కంచుకోట అన్నట్లు ఉండేది. అక్కడ తిరుగులేని విజయాలు సొంతం చేసుకుంది..కానీ రాష్ట్ర విభజన తర్వాత తెలంగాణలో టీడీపీ పూర్తిగా దెబ్బతింది. అయితే 2014 ఎన్నికల్లో టీడీపీ బాగానే సీట్లు తెచ్చుకుంది. 15 సీట్లు టీడీపీ గెలిచింది. కానీ కేసీఆర్ ఆపరేషన్ ఆకర్ష్‌తో టీడీపీని గట్టిగా దెబ్బతీశారు. ఇక రేవంత్ రెడ్డి లాంటి వారు కాంగ్రెస్ లోకి వెళ్ళడంతో..టీడీపీ పతన దశకు వచ్చింది.

2018 ఎన్నికల్లో కాంగ్రెస్ తో పొత్తు పెట్టుకుని..కేవలం 2 సీట్లు మాత్రమే గెలుచుకుంది. అలా గెలిచిన ఎమ్మెల్యేలని కూడా కేసీఆర్ లాగేసుకున్నారు. దీంతో తెలంగాణలో టీడీపీకి ఒక్క ఎమ్మెల్యే బలం లేదు. అటు ఏపీలో కూడా టీడీపీ ఓడిపోవడంతో బాబు..ఏపీపైనే దృష్టి పెట్టారు. తెలంగాణ రాజకీయాల వైపు చూడలేదు. కానీ ఇటీవల కేసీఆర్..బీఆర్ఎస్‌తో దేశ రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చారు..అలాగే ఏపీలో కూడా ఫోకస్ పెట్టారు. దీంతో బాబు..తెలంగాణ రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చారు.

తాజాగా ఖమ్మంలో భారీ సభ పెట్టి..మాజీ తమ్ముళ్ళు తిరిగి రావాలని పిలుపునిచ్చారు. మరి బాబు మాట విని ఎంతమంది తమ్ముళ్ళు తిరిగి వస్తారో తెలియదు గాని..తెలంగాణలో టీడీపీ బలం పెంచాలని చూస్తున్నారు. అయితే ఇప్పుడున్న పరిస్తితుల్లో టీడీపీకి ఒక్క సీటు కూడా గెలిచే బలం లేదు. కానీ ఖమ్మం, హైదరాబాద్, మహబూబ్‌నగర్, నల్గొండ లాంటి జిల్లాల్లో కొన్ని సీట్లలో టీడీపీ బలం పెంచాలని చూస్తున్నారు.

దాదాపు 30 సీట్లలో టీడీపీ బలం పెంచితే..రాజకీయాలు మారే ఛాన్స్ ఉంది. గెలవకపోయినా పర్లేదు. గెలుపోటములని తారుమారు చేసేలా ఓ 10 వేల ఓటు బ్యాంక్ తెచ్చుకున్న చాలు..దాంతో బీజేపీ పొత్తు కోసం చూడవచ్చు..అటు బీఆర్ఎస్ పార్టీకి నష్టం జరగవచ్చు. చూడాలి మరి మున్ముందు తెలంగాణలో టీడీపీ రాజకీయం ఎలా ఉంటుందో.