ఊహించని ట్విస్ట్..కంచుకోటలో వెనుకబడ్డ టీడీపీ!

ఉమ్మడి కృష్ణా జిల్లాలో రాజకీయాలు పోటాపోటిగా నడుస్తున్నాయి. వైసీపీ-టీడీపీల మధ్య హోరాహోరీ పోరు నడుస్తోంది. గత ఎన్నికల్లో జిల్లాలో వైసీపీ పైచేయి సాధించిన విషయం తెలిసిందే. జిల్లాలో 16 సీట్లు ఉంటే వైసీపీ 14, టీడీపీ 2 సీట్లు మాత్రమే గెలుచుకుంది. అందులో ఎమ్మెల్యే వంశీ వైసీపీ వైపుకు వెళ్లారు. దీంతో టీడీపీకి ఒక్కరే ఎమ్మెల్యే మిగిలారు. అయితే అలా గత ఎన్నికల్లో దారుణ పరాజయం చూసిన టీడీపీ..ఇప్పుడు నిదానంగా బలపడుతుంది. వచ్చే ఎన్నికల్లో మెజారిటీ సీట్లు దక్కించుకోవాలని చూస్తుంది.

ప్రస్తుతానికి జిల్లాలో వైసీపీకి ధీటుగా టీడీపీ బలపడింది. జిల్లాలో 16 సీట్లు ఉంటే 5 సీట్లలో టీడీపీ, 5 సీట్లలో వైసీపీ బలంగా ఉంటే..6 సీట్లలో హోరాహోరీ పోరు ఉంది. అయితే ఊహించని విధంగా వైసీపీపై వ్యతిరేకత ఉన్నా సరే..నందిగామ నియోజకవర్గంలో టీడీపీ వెనుకబడి ఉంది. మామూలుగానే నందిగామ టీడీపీ కంచుకోట. ఇక్కడ ఆ పార్టీ మంచి విజయాలు సాధించింది. 1989, 2019 ఎన్నికల్లోనే ఇక్కడ ఓడింది. 2019 ఎన్నికల్లో ఇక్కడ వైసీపీ నుంచి మొండితోక జగన్ మోహన్ రావు గెలిచారు.

ఎమ్మెల్యేగా జగన్..అనుకున్న స్థాయిలో నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయలేదు. అలా అని ఈయనపై నెగిటివ్ పెద్దగా కనిపించడం లేదు. పెద్దగా వివాదాల్లో కూడా లేరు. అయితే ఇక్కడ టీడీపీకి బలపడటానికి మంచి అవకాశాలు ఉన్నాయి. కానీ అనుకున్న స్థాయిలో టీడీపీ నాయకురాలు తంగిరాల సౌమ్య బలపడినట్లు కనిపించడం లేదు.

ఇటీవల వస్తున్న సర్వేల్లో నందిగామలో ప్రస్తుతం వైసీపీదే పైచేయిగా ఉందని తెలుస్తోంది. దాదాపు 2 శాతం ఆధిక్యం వైసీపీకి ఉందట. అంటే ఇక్కడ టీడీపీ ఇంకా కష్టపడాల్సి ఉంది. అలా కాకుండా లైట్ తీసుకుంటే కంచుకోటని మరోసారి కోల్పోవాలసిందే.