వ్యతిరేక ఓటుపైనే పవన్..బీజేపీ సర్దుకుంటుందా?

మళ్ళీ అదే మాట..వైసీపీ ప్రభుత్వ వ్యతిరేక ఓట్లని చీలనివ్వను..వచ్చే ఎన్నికల్లో ఖచ్చితంగా వైసీపీని ఓడించి తీరతామని పవన్ కల్యాణ్ స్ట్రాంగ్ గా చెబుతున్నారు. తాజాగా చనిపోయిన కౌలు రైతులకు సత్తెనపల్లి వేదికగా ఆర్ధిక సాయం అందించారు. ఈ సందర్భంగా వైసీపీ ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. అటు అంబటి రాంబాబుని సైతం టార్గెట్ చేసి ఫైర్ అయ్యారు.

అయితే వచ్చే ఎన్నికల్లో ఖచ్చితంగా వైసీపీని ఓడిస్తామని పవన్ చెప్పుకొచ్చారు.  వైపీపీ వ్యతిరేక ఓటును చీలనివ్వనని.. దీనికే కట్టుబడి ఉన్నానని, వైసీపీ గాడిదలు ఏం కూసినా మళ్లీ అధికారంలోకి రాలేరని.. వారు ఓడిపోబోతున్నారని, గత ఎన్నికల్లో విడివిడిగా పోటీ చేయడం వల్ల ఓట్లు చీలిపోయి వైసీపీ అధికారంలోకి వచ్చేది కాదని, ఈ సారి ఆ పరిస్తితి రానివ్వమని, రాజకీయ క్రీడలో ఓటు చీలకుండా ఎలా ఆడాలనేదే మన ముందున్న లక్ష్యమని, ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉన్న శక్తులను కలిపి ముందుకు తీసుకెళ్లడం.. కొత్త ప్రభుత్వాన్ని స్థాపించడం..తన లక్ష్యమని, ఇక ముఖ్యమంత్రిని చేస్తారా లేదా అనేది తర్వాత అని, మీ అందరి గుండెచప్పుడు బలంగా ఉంటే ముఖ్యమంత్రిని అవుతానని చెప్పుకొచ్చారు.

అయితే ఇక్కడ క్లారిటీ పవన్ చెప్పే దాని బట్టే చూస్తే టీడీపీతో కలిస్తేనే వైసీపీని అధికారం నుంచి దించగలమని గట్టిగా భావిస్తున్నారు. ఆయనే కాదు..అటు జనసేన శ్రేణులైన, ఇటు టీడీపీ శ్రేణులైన అదే అనుకుంటున్నారు. రెండు పార్టీలు కలిస్తేనే..ఓట్లు చీలకుండా వైసీపీకి చెక్ పెట్టగలరు. కాకపోతే టీడీపీతో పొత్తుకు బీజేపీ ఒప్పుకోవడం లేదు. టీడీపీతో కలిసే ప్రసక్తి లేదని బీజేపీ అంటుంది..కానీ పవన్ ఏమో టీడీపీతో కలవడానికే రెడీగా ఉన్నారు.

మరి అందరినీ ఏకతాటిపైకి తీసుకోస్తానని పవన్ అంటున్నారు..అంటే బీజేపీని ఒప్పించి..టీడీపీతో కలిసేలా చేస్తారా? లేక బీజేపీని పక్కన పెట్టి టీడీపీతో కలుస్తారా? అనేది ఇప్పుడు ప్రధనంగా మారింది. చివరికి పవన్ ఎలా ముందుకెళ్తారో చూడాలి.