వచ్చే ఏడాది సంక్రాంతికి టాలీవుడ్ తో పాటు కోలీవుడ్ లోనూ గట్టి పోటీ నడవబోతోంది. తమిళ స్టార్ హీరోలు అజిత్, విజయ్ దళపతి నువ్వా-నేనా అంటూ తల పడబోతున్నారు. `తనివు` అనే అవుట్ అండ్ అవుట్ యాక్షన్ ఎంటర్టైనర్ తో తమిళం తో పాటు తెలుగు ప్రేక్షకులను పలకరించబోతున్నాడు అజిత్. హెచ్ వినోద్ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని జి స్టూడియోస్ తో కలిసి బోనీ కపూర్ నిర్మించారు.
విజయ్ విషయానికి వస్తే.. ఈయన వంశీ పైడిపల్లి దర్శకత్వంలో `వరిసు(తెలుగులో వారసుడు)` అనే సినిమా చేస్తున్నాడు. దిల్ రాజు నిర్మిస్తున్న ఈ చిత్రంలో రష్మిక హీరోయిన్ గా నటించింది. వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా ఈ రెండు చిత్రాలు విడుదల కాబోతున్నాయి. అయితే తాజాగా దిల్ రాజు.. ఓ సమీక్షలో మాట్లాడుతూ.. అజిత్ కన్నా విజయ్ పెద్ద స్టార్ అంటూ కామెంట్స్ చేశాడు.
`తమిళనాడులో నా సినిమాతో పాటు అజిత్ సినిమా రిలీజ్ అవుతుంది. అక్కడ మొత్తం 800 స్క్రీన్లు ఉన్నాయి. మా సినిమాకు 400 స్క్రీన్ లు, ఆయన సినిమాకు 400 స్క్రీన్లు ఇస్తామని అక్కడ వారు చెబుతున్నారు. కానీ అజిత్ కంటే విజయ్ పెద్ద స్టార్. కాబట్టి మాకు 50 స్క్రీన్లు ఎక్కువ ఇవ్వండి అని విజ్ఞాప్తి చేస్తున్నా` అంటూ దిల్ రాజు చెప్పుకొచ్చాడు. ఈయన కామెంట్స్ ఇప్పుడు కోలీవుడ్ లో కాక రేపుతున్నాయి. అజిత్ అభిమానులు దిల్ రాజుపై మండిపడుతున్నారు. ఒక హీరో ఎక్కువ ఒక హీరో తక్కువ అంటూ ఎలా కామెంట్స్ చేస్తారు అంటూ దిల్ రాజును ఏ రేంజ్ లో ఏకేస్తున్నారు.