బడా నిర్మాత, డిస్ట్రిబ్యూటర్ దిల్ రాజు పేరు ఇటు టాలీవుడ్ తో పాటు అటు కోలీవుడ్ లోనూ గత కొద్ది రోజుల నుంచి మారుమోగిపోతున్న సంగతి తెలిసిందే. ఈయన నిర్మించిన తమిళ చిత్రం `వారసుడు` అనేక వివాదాలు తో విడుదలకు సిద్ధమవుతోంది. విజయ్ దళపతి హీరోగా వంశీ పైడిపల్లి దర్శకత్వంలో రూపుదిద్దుకున్న ఈ చిత్రం సంక్రాంతి కానుకగా జనవరి 12న గ్రాండ్ రిలీజ్ కాబోతోంది.
అయితే ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా దిల్ రాజు తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన ఎన్నో ఇంట్రెస్టింగ్ విషయాలను పంచుకున్నారు. `నేను మొండివాణ్ణి.. నాకు నచ్చితే డిస్ట్రిబ్యూటర్ గా, ప్రొడ్యూసర్ గా ఎక్కడివరకైనా వెళ్లి రిస్క్ చేస్తాను. వందల కోట్ల బడ్జెట్ లో నేను సినిమాలు చేయడం రిస్క్ తో కూడుకున్న వ్యవహారమే. అయితే పాన్ ఇండియా సినిమాకి లెక్కలు వేస్తూ కూర్చోవడం కరెక్టు కాదు. రిస్క్ చేయడం వల్లనే నేను ఈ స్థాయికి వచ్చాను.` అంటూ దిల్ రాజు చెప్పుకొచ్చారు.
“మహేశ్ బాబు `స్పైడర్`, పవన్ `అజ్ఞాతవాసి` డిస్ట్రిబ్యూటర్ గా నా కెరియర్ లోనే బిగ్గెస్ట్ ఫైనాన్షియల్ డామేజ్. అయినా నేను తట్టుకుని నిలబడ్డాను. 2017లో నిర్మాతగా నేను వరుస సక్సెస్ లు చూడటం అందుకు కారణం. అక్కడ వచ్చిన డబ్బు ఇక్కడ పోయింది. అందువలన బ్యాలెన్స్ అయింది. అలా కాకుండా సొంత డబ్బుపోతే ఆ టైమ్ లో మరొకరైతే సూసైడ్ చేసుకుంటాడు. లేదా ఇండస్ట్రీ నుంచి పారిపోతారు“ అంటు దిల్ రాజు సంచలన వ్యాఖ్యలు చేశారు.