తెలంగాణలో తెలుగుదేశం పార్టీని అభిమానించే వారు ఇంకా ఉన్నారని తాజాగా ఖమ్మం సభతో నిరూపితమైంది. నాయకులు వెళ్ళిన…ఇంకా కొంతమంది కార్యకర్తలు పార్టీపై అభిమానంతో ఉన్నారని అర్ధమవుతుంది. ఇక అధినేత చంద్రబాబు రావడంతో తమ్ముళ్ళల్లో జోష్ మరింత పెరిగింది. ఖమ్మంలో టీటీడీపీ నేతలు, కార్యకర్తలు సత్తా చాటారు. ఇక తెలంగాణలో తెలుగుదేశం పార్టీ లేదనే వారికి ఖమ్మం సభే జవాబు అని బాబు అన్నారు. ఇందులో వాస్తవం కూడా ఉందని అనుకోవాలి..ఎందుకంటే ఏ మాత్రం నాయకులు లేకపోయినా సరే..ఆ స్థాయిలో సభకు కార్యకర్తలు, స్థానిక ప్రజలు వచ్చారంటే..టీడీపీపై ఇంకా అభిమానం ఉందని అనుకోవచ్చు.
అయితే ఖమ్మం సభలో చంద్రబాబు ఆద్యంతం..గతంలో టీడీపీ చేసిన కార్యక్రమాలు, అభివృద్ధి పనులు, ఐటీ అభివృద్ధి, సాగునీటి ప్రాజెక్టులు తీసుకురావడం..ఇలా గత టీడీపీ హయంలో జరిగిన పనులన్నీ చంద్రబాబు చెప్పుకొచ్చారు. కాబట్టి ఆ పనులు గుర్తు చేసుకుని మళ్ళీ ప్రజలు టీడీపీని ఆదరించాలని కోరారు. అయితే బాబు ఎక్కడా కూడా తెలంగాణలో అధికార పక్షాన్ని గాని..ప్రతిపక్ష పార్టీలపై విమర్శలు చేయలేదు.
తెలంగాణలో అధికారంలో ఉన్న బీఆర్ఎస్‌పై విమర్శలు చేయలేదు. అంటే కొన్ని రాజకీయ కారణాల వల్ల కేసీఆర్ ప్రభుత్వాన్ని టార్గెట్ చేయలేదని తెలుస్తోంది. అదే విధంగా బీజేపీ ఊసు తీయలేదు. ఎందుకంటే కేంద్రంలో బీజేపీ అధికారంలో ఉంది. ఇటు కాంగ్రెస్ పార్టీని ఒక్క మాట అనలేదు. ఎలాగో అక్కడ రేవంత్ రెడ్డి ఉన్నారు. ఇలా ఎవరిని విమర్శించకుండా..కేవలం గతంలో తాము చేసిన పనులనే బాబు చెప్పుకొచ్చారు.
అదే సమయంలో తెలంగాణలో టీడీపీని వీడి వెళ్లిన నాయకులంతా తిరిగి పార్టీలోకి రావాలని, అందరం కలిసి తెలంగాణలో తెలుగుదేశం పార్టీకి పునర్వైభవం తీసుకొద్దామని, అభివృద్ధిలో, సంక్షేమంలో రాష్ట్రాన్ని ముందుకు తీసుకుపోదామని పిలుపునిచ్చారు. మరి బాబు మాటకు ఎంతమంది మాజీ తెలుగు తమ్ముళ్ళు స్పందిస్తారో చూడాలి..మళ్ళీ టీడీపీలోకి వస్తారో లేదో చూడాలి.