బాపట్ల జిల్లా చీరాలలో మాజీ మంత్రి డాక్టర్ పాలేటి రామారావు వినూత్నంగా నిర్వహించిన ‘మరణ దిన వేడుకలు’వెనక చాలా గూడార్థం ఉందని రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు. ఆయన ఏదో ఆషామాషీగా,అర్థరహితంగా ఈ కార్యక్రమం నిర్వహించలేదని చీరాల రాజకీయ తాజా పరిణామాలను బాగా విశ్లేషించిన వారికి స్పష్టంగా అవగతమవుతుంది.ఇంకా చెప్పాలంటే ఎమ్మెల్యే కరణం బలరాం ను టార్గెట్ చేసి డాక్టర్ పాలేటి ఈ కార్యక్రమానికి డిజైన్ చేశారని సర్వత్రా వినవస్తోంది.
కొద్దిగా వెనక్కు వెళితే..!
2019లో చీరాల నుండి టిడిపి అభ్యర్థిగా పోటీ చేసిన కరణం బలరాం గెలుపులో డాక్టర్ పాలేటి రామారావు కీలకపాత్ర పోషించారు.ఆయనకు అత్యంత విధేయంగా మెలగడమే కాకుండా బలరాం వైసిపి గూటికి చేరినప్పుడు కూడా ఆయనను పాలేటి అనుసరించారు. అయితే తదుపరి పరిణామాలలో తనను కరణం బలరాం పక్కన పెడుతున్నారన్న భావన డాక్టర్ పాలేటికి కలిగింది. ఇతర విషయాలను పక్కన పెడితే పొలిమేర రోడ్డు లోని కమ్మ సంఘం కార్యాలయ భవన వ్యవహారం బలరాం, పాలేటిల మధ్య బాగా దూరం పెంచిందనే చెప్పాలి.తన సామాజిక వర్గీయులను కాపాడుకోవడం కోసం బలరాం ఈ భవన వ్యవహారంలో తనను బలి పశువును చేశారన్న ఆక్రోషం పాలేటిలో నాటుకుంది.ఆ తర్వాత నుండి డాక్టర్ పాలేటి ఎమ్మెల్యే బలరాం కార్యక్రమాలకు హాజరు కావడం లేదు.
వర్తమానానికి వస్తే…!
ఎమ్మెల్యే కరణం బలరాం గత అక్టోబర్ 31వ తేదీన 76వ జన్మదిన వేడుకలు జరుపుకున్నారుఆయన వర్గీయులు అభిమానులు అంగరంగ వైభవంగా ఈ వేడుకలు నిర్వహించారు. ఆ ఘట్టంలో నుండి డాక్టర్ పాలేటికి మరణ దిన వేడుకల ఆలోచన పుట్టుకొచ్చిందని చెబుతున్నారు. జన్మదిన వేడుకలు జరుపుకోవడం కాదు జనాలకు బలరాం ఏం ? మేలు చేశారు అన్న విషయాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లడానికి వీలుగా ఈ కార్యక్రమానికి ఆయన రూపకల్పన చేశారని వస్తోంది.అందుకు ఆయన తన పుట్టినరోజునే వేదికగా మార్చుకున్నారు.
పాలేటి ప్రసంగ సారాంశం కూడా అదే..!
వాస్తవానికి డాక్టర్ పాలేటి వయసు ఇప్పుడు 63 సంవత్సరాలే అయినప్పటికీ బలరాం వయసు దృష్ట్యా ఆయన 75 ఏళ్లను టార్గెట్ గా పెట్టుకొని ఈ వేడుకలు నిర్వహించారని కూడా విశ్లేషణ జరుగుతోంది.ఇక ఈ వేడుకల్లో డాక్టర్ పాలేటి ప్రసంగాన్ని బట్టి చూస్తే ఆయన కరణం బలరాంకే ఉద్బోధ చేసినట్టు స్పష్టమవుతోంది.మరణానికి చేరువైన సమయంలోనైనా,మంచి పనులు చేయాలని నలుగురికి ఉపయోగపడాలని పాలేటి తన ప్రసంగంలో నొక్కి చెప్పారు. ఇది ఎమ్మెల్యే బలరాంను ఉద్దేశించి అన్నదేనని ఆయన వర్గీయులు కూడా భావిస్తున్నారు.తద్వారా ఎమ్మెల్యే బలరాం ప్రజలకు ఏమి చేయడం లేదని పాలేటి హింట్ ఇచ్చినట్లుగా కూడా పరిగణిస్తున్నారు.
పనిలో పనిగా పరోక్ష హెచ్చరిక..!
అంతేగాక తన లైట్ తీసుకోవద్దని కూడా బలరాం వర్గానికి పాలేటి స్పష్టమైన సంకేతమిచ్చారు. తనకిప్పుడు 63 సంవత్సరాలే అని, ఇంకో 12 సంవత్సరాలు తాను తప్పనిసరిగా జీవిస్తానని ఆయన ఉద్ఘాటించటం ద్వారా తాను మరో రెండు అసెంబ్లీ ఎన్నికలు చూస్తానని,తన సత్తా చాటుతానని పాలేటి చెప్పకనే చెప్పారు.మొత్తం మీద ఈ డాక్టర్ మరో ఆపరేషన్ కు సిద్ధమవుతున్న వాతావరణం గోచరిస్తోంది. ఏం జరుగుతుందో చూడాలి.