సైకిల్‌ని గుర్తుచేసుకుంటున్న కారులోని మాజీ తమ్ముళ్ళు.!

తెలంగాణలో అధికార బీఆర్ఎస్ పార్టీలో సగానికి సగం పైనే టీడీపీ నుంచి వచ్చిన వారే..ఇందులో ఎలాంటి డౌట్ లేదు. ఎందుకంటే ఆఖరికి కేసీఆర్ సైతం టీడీపీ నుంచి బయటకొచ్చిన నాయకుడే. ఇక రాష్ట్ర విభజన తర్వాత పూర్తిగా టీడీపీని కేసీఆర్ లాగేసుకున్నారు. టీడీపీ నేతలనే కాదు..కార్యకర్తలని కూడా లాక్కున్నారు. దీంతో తెలంగాణలో టీడీపీ మనుగడ కష్టమైంది.

అయితే ఇటీవల చంద్రబాబు మళ్ళీ తెలంగాణ రాజకీయాల్లోకి వచ్చి..పార్టీ వీడి వెళ్ళిన నాయకులని మళ్ళీ పార్టీలోకి రావాలని కోరిన విషయం తెలిసిందే. ఇప్పటికే పలువురు నేతలతో టీడీపీ చర్చలు చేస్తున్నట్లు తెలిసింది. ఈ విషయం పక్కన పెడితే బీఆర్ఎస్ పార్టీలో ఉన్న మాజీ తమ్ముళ్ళు మళ్ళీ తెలుగుదేశం పార్టీని గుర్తు చేసుకుంటున్నారు. నిజానికి బీఆర్ఎస్ లో చేరిన చాలామంది తమ్ముళ్ళకు..టీడీపీపై కోపం లేదు. తప్పనిసరి పరిస్తితుల్లో పార్టీని వీడి వెళ్లారు.  అందుకే టీడీపీపై పెద్దగా విమర్శలు చేసిన సందర్భాలు కూడా లేవు.

అయితే ఇప్పుడు టీడీపీ మళ్ళీ యాక్టివ్ అవుతుండటంతో బీఆర్ఎస్ లో ఉన్న మాజీ తమ్ముళ్ళు కాస్త టెన్షన్ పడుతున్నారు. ఎందుకంటే టీడీపీకి గెలవకపోవచ్చు గాని కొన్ని ఓట్లని గాని చీలిస్తే బీఆర్ఎస్ పార్టీకే ప్రమాదం. అందుకే దాన్ని గ్రహించిన మాజీ తమ్ముళ్ళు..టీడీపీని గుర్తు చేసుకుంటున్నారు. తమకు సొంత పార్టీలోనే శత్రువులు ఉన్నారని..అదే టీడీపీలో ఉన్నప్పుడు పెద్దగా ఇబ్బందులు రాలేదని గుర్తు చేసుకుంటున్నారు.

తాజాగా సత్తుపల్లి ఎమ్మెల్యే వీరయ్య..టీడీపీని వీడాలని అనుకోలేదని, కానీ అందరూ పార్టీని వీడి వెళ్లిపోవడంతో తప్పనిసరి పరిస్తితుల్లో పార్టీని వీడానని చెప్పుకొచ్చారు. టీడీపీ కోసం కేసులనూ ఎదుర్కొన్నానని వీరయ్య, బీఆర్ఎస్ లో ప్రస్తుత పరిస్థితులను సత్తుపల్లి ప్రజలు తెలుసుకుంటారని అంటున్నారు. వరుసగా మూడుసార్లు టీడీపీ నుంచి గెలిచిన వీరయ్య..2018 ఎన్నికల తర్వాత బీఆర్ఎస్ లో చేరారు. అయితే సత్తుపల్లిలో టీడీపీకి కాస్త బలం ఉంది. ఇప్పుడు టీడీపీ ఓటర్ల కోసం వీరయ్య ..టీడీపీపై ఉన్న అభిమానాన్ని గుర్తు చేసుకుంటున్నారు.