ఆనం వారి అసంతృప్తి..సిగ్నల్స్ ఇస్తున్నారా?

మొదట నుంచి అధికార వైసీపీలో అసంతృప్తి గళం వినిపిస్తున్న నాయకుడు ఎవరైనా ఉన్నారంటే..అది సీనియర్ ఎమ్మెల్యే ఆనం రామ్ నారాయణ రెడ్డి అని చెప్పవచ్చు. వాస్తవానికి వైసీపీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణంరాజు ఎప్పుడైతే వైసీపీపై విమర్శలు చేయడం మొదలుపెట్టారో..అప్పటినుంచే ఆనం కూడా సొంత పార్టీపై అసంతృప్తి రాగం వినిపిస్తున్నారు. కాకపోతే రఘురామ మరీ దూకుడుగా విమర్శలు చేశారు. ఆనం విమర్శలు చేసినా మధ్యలో సైలెంట్ అయిపోయారు. దీంతో ఆయన పార్టీకి దూరం అవ్వలేదు.

కానీ ఇటీవల కాలంలో ఆయన మరింత ఎక్కువగా అసంతృప్తి రాగం వినిపిస్తున్నారు. ఇప్పటికే తన నియోజకవర్గంలో అభివృద్ధి కార్యక్రమాలు జరగడం లేదని విమర్శలు చేశారు. తాజాగా మాత్రం ఈ మూడున్నర ఏళ్ల పాలనలో మనం ఏం చేశామని ప్రశ్నించారు.  గతంలో ఇచ్చిన పథకాలనే ఇప్పుడు ఇస్తున్నామని, కాకపోతే ఓ పది రూపాయిలు ఎక్కువగా ఇస్తున్నామని అంతే అని అన్నారు.

రోడ్లు గుంతలు పూడ్చలేకపోతున్నామని.. తాగడానికి నీళ్లు లేవు అంటే కేంద్ర ప్రభుత్వం జలజీవన మిషన్ కింద నిధులు ఇస్తుందని అన్నారు. కేంద్ర ప్రభుత్వం నిధులు ఇస్తే మీరేం చేస్తున్నారని ప్రజలు అడుగుతున్నారని తెలిపారు. ఈ నాలుగేళ్లలో ఏం పని చేశామని ఓట్లు వేయమని అడగాలని…ప్రాజెక్టులు ఏమైనా కట్టామా? పనైనా మొదలుపెట్టామా? శంకుస్థాపన ఏమన్నా చేసామా? ఏమని ఓట్లు అడగాలని అన్నారు.

ఇక పెన్షన్లు ఇస్తే ఓట్లు వేసేస్తారా? గత ప్రభుత్వమూ పెన్షన్లు ఇచ్చిందని గుర్తు చేశారు. లే అవుట్లు వేశాం గాని ఇళ్ళు కట్టడం లేదని, గతంలో వైఎస్సార్ హయాంలో పెద్ద ఎత్తున ఇళ్ళు నిర్మించామని చెప్పుకొచ్చారు. మొత్తానికి వైసీపీ సర్కార్‌పై తీవ్ర స్థాయిలో ఆనం అసంతృప్తి వ్యక్తం చేశారు. అయితే ఈయన టీడీపీలోకి వెళ్తారని ఎప్పటినుంచో ప్రచారం ఉంది. మరి అందుకే ఈ రకంగా సొంత పార్టీపైనే విమర్శలు చేస్తున్నారేమో విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.