చంద్రముఖి… ఈ సినిమాని సౌత్ సినిమా ప్రేక్షకులు అంత త్వరగా మర్చిపోలేరు. తమిళ సూపర్ స్టార్ రజినీకాంత్ హీరోగా 2005లో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ హారర్ మూవీ ఎలాంటి ప్రభంజనం సృష్టించిందో అందరికీ తెలిసిందే. ఆ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద దుమ్ము దులపడంతో మళ్లీ అదే కథకు సీక్వెల్ తీసుకురావాలి అని దర్శకుడు పీ. వాసు 10 ఏళ్ల క్రితమే ప్లాన్ చేశాడు. కానీ సరైన కథ సెట్ అవ్వకపోవడంతో మిన్నకుండిపోయారు. అయితే మళ్ళీ ఇన్నాళ్లకు దర్శకుడు సీక్వెల్ కథను తెరపైకి తీసుకు వస్తున్నాడు.
అయితే ఈసారి ఈ సీక్వెల్స్ లో సూపర్ స్టార్ రజినీకాంత్ కాకుండా డాన్స్ కొరియోగ్రాఫర్ నుంచి స్టార్ హీరోగా ఎదిగిన రాఘవ లారెన్స్ హీరోగా చేస్తున్నాడు. ఇక చంద్రముఖి 2 షూటింగ్ మొదలుపెట్టి చాలా కాలం అయినప్పటికీ మధ్యలో కొన్ని కారణాల వలన బ్రేకులు పడ్డాయి. అయితే తాజాగా హైదరాబాదులో మళ్ళీ ఈ సినిమాకు సంబంధించిన మరొక కొత్త షెడ్యూల్లో మొదలుపెట్టారు. ఇందులో కీలక సన్నివేశాలు తీస్తారని సమాచారం. అయితే ప్రస్తుతం వినిపిస్తున్న మరొక టాక్ ప్రకారం ఈ సినిమాలో బాలీవుడ్ స్టార్ క్వీన్ కంగనా రనౌత్ ఒక ముఖ్యమైన పాత్రలో కనిపించబోతున్నట్లుగా గుసగుసలు వినబడుతున్నాయి.
అవును, దర్శకుడు ఆమెకు చాన్నాళ్ల క్రితమే కథ గురించి చర్చలు జరిపాడట. కథ నచ్చడంతో క్వీన్ సినిమా చేస్తానని ఒప్పుకుందని వినికిడి. అయితే ఈ విషయం ఇంకా అధికారికంగా వెలువడలేదు. ప్రస్తుతం బాలీవుడ్ హీరోయిన్స్ అత్యధిక పారితోషికం అందుకుంటున్న వారిలో కంగనా మొదటి వరుసలో వుంటారు. అయితే ఆమె నటించిన గత నాలుగు సినిమాలు కూడా బాక్సాఫీస్ వద్ద తీవ్రంగా నిరాశ పడటంతో ఇప్పుడు చంద్రముఖి సీక్వెల్లో నటిస్తే సౌత్ లో కొంత క్రేజ్ వచ్చే అవకాశం ఉంటుంది అని భావిస్తోందని వినికిడి.