విశాఖ గర్జన పేరుతో.. ఏపీ అధికార పార్టీ.. వైసీపీ నిర్వహించిన కార్యక్రమం.. సక్సెస్ అయిందని.. ఆ పార్టీ నేతలు చెప్పుకొంటారు. నిండు కుండపోత వర్షంలోనూ.. ఆ పార్టీ నాయకులు ప్రసంగించడం చూశాం. ఇక, దీనికి ముందు కళాజాతాలు.. ఇతరత్రా కార్యక్రమాలు కూడా అట్టహాసంగానే జరిగాయి. తీరా ర్యాలీ సగంలోకి వచ్చేసరికి మాత్రం పరిస్థితి యూటర్న్ తీసుకుంది. జోరు వర్షం కురిసింది. అయినా.. కార్యక్రమం హిట్ చేశామని.. మంత్రులు.. నాయకులు చెప్పారు. సరే.. అసలు ఈ కార్యక్రమం ద్వారా.. వైసీపీ నాయకులు ఏం చెప్పదలుచుకున్నారు? అనేది ప్రశ్న.
వాస్తవానికి 2020లోనే.. సీఎం జగన్.. మూడు రాజధానుల విషయంపై అసెంబ్లీలో ప్రకటన చేశారు. అయితే.. రాజధాని అమరావతికి భూములు ఇచ్చిన రైతులు.. ప్రభుత్వ ప్రకటనను ఖండించారు. వెంటనే న్యాయపోరాటం.. నిరసన.. ధర్నాలకు దిగారు. ఇక, తర్వాత.. పాదయాత్ర కూడా చేశారు. చేస్తు న్నారు. అంటే.. మూడు రాజధానులు వద్దని.. ఏకైక రాజధాని అమరావతి మాత్రమే ఉండాలని.. వారు కోరుతున్నారు. కానీ, వైసీపీ నాయకులు మాత్రం.. అమరావతి కేవలం పెట్టుబడిదారులకు చెందినదని.. ఇక్కడ పేదలకు ఇళ్లు ఇస్తామంటే కూడా.. ఒప్పుకోవడం లేదని.. ఒక వాదనను బలంగా వినిపించారు.
ఇది… సాధారణ ప్రజల్లోకి వెళ్తున్న సమయంలోనే.. రైతుల పాదయాత్ర ప్రారంభమైంది. దీంతో ప్రజల్లోకి రైతులు.. తాము త్యాగాలుచేశామంటూ.. తమ వాదనను వినిపిస్తున్నారు. సరే.. ఈ విషయాన్ని పక్కన పెడితే.. ప్రభుత్వం.. ఎంచుకున్న మూడు రాజధానుల విషయంపై.. ఆశించిన మేరకు ప్రజల్లో చర్చ అయితే.. రాలేదు. కర్నూలులో న్యాయరాజధాని అనే డిమాండు ఎప్పటి నుంచో ఉంది కాబట్టి.. దీనికి చర్చ అవసరం లేదు. కానీ, ఎటొచ్చీ.. విశాఖను అభివృద్ధి చేయడం.. దీనిని రాజధానిగా ప్రకటించడం వంటివే.. వైసీపీ చేయాల్సి ఉంటుంది.
అమరావతిని ఎలానూ శాసన రాజధానిగానే ప్రకటించనున్నారు కనుక.. ఇక్కడ అప్పటికే అఅభివృద్ధి జరిగింది కాబట్టి.. దీనిపైనా చర్చలేదు. ఈ క్రమంలోనే ప్రజలను చైతన్య పరచాల్సిన పరిస్థితి వైసీపీపై ఉందనేది వాస్తవం. ప్రతిపక్షాలు.. విశాఖను దోచుకునేందుకు వైసీపీ ఇక్కడ ప్రయత్నాలు చేస్తోందని.. అందుకే.. రాజధాని ఏర్పాటు అంశాన్ని తెరమీదికి తెచ్చిందని అంటున్నారు. దీనికి కూడా చెక్ పెట్టాల్సిన అవసరం ఎంతైనా ఉందనేది నాయకుల మాట. ఈ క్రమంలోనే గర్జనకు ప్రాధాన్యం ఇచ్చారు. ప్రజల్లో ఒక చర్చను రేకెత్తించడం ద్వారా విశాఖ రాజధానిపై తన వ్యూహాన్ని బలంగా తీసుకువెళ్లాలనే ఆలోచన వైసీపీ చేసింది. సో.. గర్జన వెనుక ఉద్దేశం ఇదే!!