గాడ్ ఫాద‌ర్ సూప‌ర్ హిట్టే అంటోన్న ఆ సెంటిమెంట్ ఇదే…!

మెగాస్టార్ చిరంజీవి అతి త్వరలోనే `గాడ్ ఫాదర్` సినిమాతో తెలుగు ప్రేక్షకులను అలరించబోతున్నారన్న సంగతి తెలిసిందే. దసరా పండుగ కానుకగా అక్టోబర్ 5న తెలుగుతో పాటు హిందీలో కూడా ఈ చిత్రం భారీ ఎత్తున రిలీజ్ కాబోతుంది. ఈ సినిమాకు మోహన్ రాజా దర్శకత్వం వహించగా కొణిదల సురేఖ సమర్పణలో సూపర్ గుడ్ ఫిల్మ్స్ కొణిదెల ప్రొడక్షన్స్ బ్యానర్లపై ఆర్ బి చౌదరి, ఎన్.వి.ప్రసాద్ నిర్మించారు. ఈ సినిమాలో నయనతార, సల్మాన్ ఖాన్, సత్యదేవ్, సునీల్, సముద్రఖ‌ని వంటి స్టార్ యాక్టర్లు కీలకపాత్రలు వహించారు. ఈ చిత్రానికి థ‌మన్ సంగీతాన్ని అందించాడు.

ఈ సినిమా విషయంలో తాజాగా కొత్త సెంటిమెంట్ వైరల్ గా మారింది. `ఖైదీ నెంబర్ 150` చిరంజీవి రీ ఎంట్రీ ఇచ్చిన సినిమా. అయితే తమిళ బ్లాక్ బాస్టర్ హిట్ `కత్తి` సినిమాకు రీమేక్ ఇది. ఇక ఈ సినిమా విడుదల సమయంలో ఎన్నో విమర్శలు వచ్చాయి. అందుకు గల కారణం అప్పటికే `కత్తి` తెలుగు డబ్బింగ్ వెర్షన్‌ను తెలుగు ప్రేక్షకుల్లో చాలామంది చూసేసారు. అటువంటి సినిమా రీమేక్ తో చిరంజీవి రీ ఎంట్రీ ఇస్తున్నాడని మెగా అభిమానులు సైతం నిరాశ వ్యక్తం చేశారు.

కట్ చేస్తే `ఖైదీ నెంబర్ 150` రిలీజ్ అయ్యి బ్లాక్ బస్టర్ హిట్గా నిలిచింది. బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపించింది. ప్రస్తుతం `గాడ్ ఫాదర్` సినిమా కూడా మలయాళ హిట్ `లూసిఫర్` కు రీమేక్ అన్న సంగతి మనందరికీ తెలిసిందే. ఇకపోతే ఈ సినిమా తెలుగు డబ్బింగ్ వర్షన్ కూడా చాలామంది ప్రేక్షకులు చూసేసారు. అయినా సరే మెగాస్టార్ వెనక్కి తగ్గకుండా `గాడ్ ఫాదర్` సినిమాను మళ్లీ చేశారు.

ఈ క్రమంలోనే `గాడ్ ఫాదర్` విషయంలో `ఖైదీ నెంబర్ 150` సెంటిమెంట్ రిపీట్ అవుతుందని.. ఈసారి కూడా చిరంజీవి సూపర్ హిట్ కొడతాడని మెగా అభిమానులతో పాటు పలువురు సినీ విశ్లేషకులు కూడా అంచనాలు వేస్తున్నారు. మరి చిరు ఈ అంచనాలు ఎంతవరకు అందుకుంటాడో చూడాలి.