పేప‌ర్ క‌టింగులు పెరుగుతున్నాయ్‌.. వైసీపీలో సెన్షేష‌న‌ల్ న్యూస్‌…!

రాజ‌కీయాల్లో నేత‌లు ఎవ‌రికి భ‌య‌ప‌డినా.. ఎవ‌రికి భ‌య‌ప‌డ‌క‌పోయినా.. ఇప్ప‌టికీ.. అంతో ఇంతో ప్రింట్ మీడియాకు భ‌య‌ప‌డుతున్నారు. పార్టీలు ఏవైనా కూడా ప్రింట్ మీడియా విష‌యంలో చాలా జాగ్ర‌త్త‌గానే వ్య‌వ‌హ‌రిస్తున్నాయి. దీనికి కార‌ణం .. సాధార‌ణ చానెళ్లు అయితే.. వార్త‌ల‌ను మార్చుకునేందుకు… వెంట‌నే స‌రిచేసుకునేందుకు అవ‌కాశం ఉంటుంది. కానీ, ప్రింటులో మాత్రం అలా కుద‌ర‌దు. ఒక‌వేళ స‌వ‌ర‌ణ‌లు వేసినా.. అప్ప‌టికే ప్ర‌జ‌ల్లోకి ప్ర‌చారం వెళ్లిపోతుంది. అందుకే.. నాయ‌కులు అంతో ఇంతో మీడియాకు భ‌య‌ప‌డుతున్నారు.

ఇక‌, అధికారంలో ఉన్న పార్టీ ఏదైనా కూడా మీడియా క‌టింగుల‌ను దాచిపెడుతుంది. త‌మ పార్టీ నేత‌ల‌పై వ‌చ్చే క‌థ‌నాలు.. ప్ర‌భుత్వంపై వ‌చ్చే విమ‌ర్శ‌లు.. నాయ‌కుల వ్య‌వ‌హార శైలిపై వ‌చ్చే విమ‌ర్శ‌లు.. ఇలా విష‌యం ఏదైనా.. మీడియా క‌టింగుల‌కు రాజ‌కీయాల్లో ఏ పార్టీకి ఆ పార్టీ ప్రాధాన్యం ఇస్తుంది. అంత‌ర్గ‌త చ‌ర్చ‌ల్లో ఆయా అంశాల‌ను ప్ర‌స్తావించి.. దానికి త‌గిన విధంగా పార్టీని , నాయ‌కుల‌ను కూడా లైన్‌లో పెట్టుకునే ప‌నులు చేస్తారు. ఇప్పుడు ఇదే ప‌ని.. వైసీపీలోనూ సాగుతోంది.

పైకి.. వైసీపీ అధిష్టానం కానీ.. నాయ‌కులుకానీ.. మేం `కొన్ని ప‌త్రిక‌లు` చ‌ద‌వం అని చెబుతారు. కానీ, అంత‌ర్గ‌తంగా మాత్రం.. వారు ఆ ప‌త్రిక‌ల‌నే చ‌దువుతారు. ఆయా పేప‌ర్ల‌లో వ‌చ్చే క‌థ‌నాలు.. వార్త‌ల‌ను లెక్క‌లోకి తీసుకుంటారు. ప్ర‌తి విష‌యాన్ని ప‌రిశీల‌నాత్మ‌కంగా చూస్తున్నారు. దానికి త‌గిన విధంగానే మార్పులు చేర్పులు చేసుకుంటున్నారు. అధికార ప‌త్రిక‌, మీడియా ఉన్న‌ప్ప‌టికీ.. ఇప్ప‌టికీ తాడేప‌ల్లి వ‌ర్గాల్లో ప్ర‌తిప‌క్ష అనుకూల మీడియాకు ప్రాధాన్యం ఉంది.

ఈ క్ర‌మంలోనే వైసీపీలోకి కీల‌క నేత‌లు స‌హా.. సంచ‌ల‌నాల‌కు వేదిక అవుతున్న వివాదాల‌కు చేరువ అవుతున్న నాయ‌కుల పేప‌ర్ క్లిప్పింగుల‌ను దాచిపెడుతున్నార‌ట‌. స‌ద‌రు నేత‌ల‌తో ప్ర‌త్యేకంగా భేటీ అయిన‌ప్పుడు.. ఆయా క‌టింగుల‌ను నేత‌ల ముందు వుంచి.. `ఇదీ మీ ప్రోగ్రెస్‌. ఇప్పుడు ఏం చేయాలో మీరే చెప్పండి!` అనే డైలాగును వ‌ద‌ల‌నున్నారు.

అయితే.. ఇక్క‌డ కేవ‌లం ఒక ప‌త్రిక‌లో వ‌చ్చిన క‌థ‌నాన్నే కాకుండా.. స‌ద‌రు అంశంపై ఒక‌టిక‌న్నా ఎక్కువ పేప‌ర్ల‌లో వ‌చ్చిన వార్త‌ల‌ను క‌టింగుల్లో పెడుతున్నారు. త‌ద్వారా.. ఆ నేత‌కు టికెట్ ఇవ్వ‌క‌పోయినా.. ఎద‌రు తిరిగే ప‌రిస్థితి ఉండ‌ద‌ని.. వారి త‌ప్పుల‌ను వారికే చూపించి.. పక్క‌కు త‌ప్పించేందుకు అవ‌కాశం ఉంటుంద‌ని.. సీనియ‌ర్లు చెబుతున్నారు. దీంతో నాయ‌కులు ఇప్పుడు ఏం చేయాల‌న్నా.. ఏం మాట్లాడాల‌న్నా.. ఎక్క‌డ‌ యాంటీ అవుతుందో.. అని బెంగ పెట్టుకున్నార‌ట‌. ఇదీ.. సంగ‌తి!!